-జనవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు
-అక్టోబర్ నాటికి పర్యాటకులకు వినియోగంలోకి కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్
-ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రోద్బలంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి చర్యలు
-పిఠాపురంలోని యూ.కొత్తపల్లిలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సందర్శించన.. అడ్డంకులు అధిగమించి త్వరలోనే అదుబాటులోకి తెస్తామని హామీ
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.. శనివారం కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్ డి స్వామి నాయుడుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.. స్థానికంగా పర్యాటక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన సముద్రం ఒకవైపు, పక్కనే ఆనుకొని బ్యాక్ వాటర్ తో కూడిన ఫ్రాక్ మరోవైపు, సమీపంలో పచ్చదనంతో కలిపి సుందరమైన ప్రాంతంగా కాకినాడ బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. గతంలో కాకినాడ బీచ్ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు..గతంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ పథకం కింద కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో అశ్రద్ధ వహించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని భావించిందని తద్వారా పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించాలని సంకల్పించింది అన్నారు.. ఈ నేపథ్యంలో కాకినాడ బీచ్ ప్రాంతంలో పర్యటిస్తున్నామన్నారు.
జనవరి నాటికి కాకినాడ బీచ్ ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ క్రమంలో అక్టోబర్ నాటికి జెట్ స్పేస్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి సుందర ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.. అక్టోబర్ మొదటి, రెండవ వారం నాటికి ఈ ప్రాంతం పర్యాటకులకు వినియోగంలోకి తెచ్చేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు.. ఇంకా ఏవైనా పనులు మిగిలిపోయి ఉంటే అంచలంచెలుగా వాటిని పూర్తి చేస్తామన్నారు.. ప్రధానంగా బీచ్ ప్రాంతంలో 16 రూములు, కెప్ట్ ఏరియా, ఫౌంటెన్సును అభివృద్ధి చేయాలని భావించామన్నారు…ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రారంభోత్సవానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
పిఠాపురంలోని యూ.కొత్తపల్లిలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సందర్శించిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం, న్యాయపరమైన సమస్యలతో మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించి, ప్రారంభించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిర్వీర్యమైందన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో, స్థానిక నాయకత్వంతో కలిసి త్వరితగతిన న్యాయపరమైన చిక్కులను అధిగమించి అందుబాటులోకి తెస్తామన్నారు.. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ నేపథ్యంలో అడ్డంకులు తొలగించి, నిధులు సమీకరణ చేసి హోటల్ మేనేజ్మెంట్ సంస్థను త్వరితగతిన ప్రారంభిస్తామన్నారు. తద్వారా కిచెన్, ఫ్రంట్ ఆఫీస్, అన్ని విభాగాల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.
అనంతరం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో స్థానిక విద్యార్థుల కోటా అంశం ఆలోచించాలని కోరారు. ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థికి నూటికి నూరు శాతం ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పర్యటనలో స్థానిక ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్ డి స్వామి నాయుడు, జిల్లా పర్యాటక శాఖ అధికారి పోశయ్య తదితరులు పాల్గొన్నారు.