అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుండి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతన్న వారికి సాయం అందించారు. భూముల రీ సర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్ లైన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. అన్నక్యాంటీన్, వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంతమంది దాతలు విరాళాలు అందించారు.
కాకాని మండలం, తక్కెళ్లపాడుకు చెందిన ఇరుకులపాటి అరుణ తన తల్లిదండ్రుల నుండి సంక్రమించిన భూమిని తనకు ఆన్ లైన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన సమస్యను పరిష్కరించాలని కోరారు. మైలవరం మండలం, గణపవరం గ్రామానికి చెందిన ఎమ్.శ్రీధర్ తన సమస్యను వివరిస్తూ….తన భార్యపై 3 ఎకరాల 69 సెంట్ల భూమి ఉందని, గత ప్రభుత్వంలో చేపట్టిన రీ సర్వేలో 60 సెంట్లు తగ్గించి 3 ఎకరాల 9 సెంట్లకు మాత్రమే పట్టాదారు పుస్తకం ఇచ్చి సరిహద్దు రాళ్లు పాతారని ఫిర్యాదు చేశారు. రీ సర్వేలో కోల్పోయిన 60 సెంట్ల భూమి తిరిగి తనకు దక్కేలా చేయాలని విన్నవించారు.
రేపల్లె నియోజకవర్గం, కావూరుకు చెందిన ఆవుల విజయమ్మ అనే వృద్ధురాలు వదర బాధితులకు రూ.1 లక్ష, అన్నక్యాంటీన్ కు రూ.10 వేలు, నరసన్నపేటకు చెందిన ముంతా రామకృష్ణ రూ.25 వేలు, నరసింహరాజు రూ.50 వేలు విరాళం అందించారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.