Breaking News

ఆరోగ్యకరమైన హృదయం.. ఆనందకరమైన జీవితం


-గుండె సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలి
-వాక్ ఫర్ హార్ట్ ప్రారంభ సందర్భంగా డీసీపీ ఎం. కృష్ణమూర్తి నాయుడు
-కార్డియలాజికల్ సొసైటీ ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 5కె వాకథాన్
-వాక్ ఫర్ హార్ట్.. లవ్ యు ఆంధ్రప్రదేశ్.. కార్యక్రమానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యకరమైన హృదయంతో ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుందని డీసీపీ ఎం. కృష్ణమూర్తి నాయుడు అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ నిర్వహించిన వాక్ ఫర్ హార్ట్.. లవ్ యు ఆంధ్రప్రదేశ్.. 5కె వాకథాన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బీఆర్టీఎస్ రోడ్డు శ్రీ శారదా కళాశాల వద్ద ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి డీసీపీ కృష్ణమూర్తి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గుండె సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలని ఆయన సూచించారు. హృదయ సంబంధ వ్యాధులు, గుండె ఆరోగ్య పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ వారికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు డాక్టర్ పి. రమేష్ బాబు మాట్లాడుతూ, హృదయ సంరక్షణ కోసం సమతుల ఆహారం, సక్రమమైన జీవన విధానం, తగినంత శారీరక శ్రమ తప్పనిసరి అని అన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలున్న వారు, వాటిని అదుపులో ఉంచుకోవాలని తెలిపారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే వైద్య పరిజ్ఞానం అందుబాటులో వచ్చిందని, గుండెపోటు వచ్చిన తొలి గంటలోనే చికిత్స అందిస్తే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చని డాక్టర్ రమేష్ బాబు వివరించారు. కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ట్రెజరర్ డాక్టర్ ఎ. పూర్ణానంద్ మాట్లాడుతూ, హృద్రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. మానసిక ఒత్తిడికి గురికాకుండా, ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపాలని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. 40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరూ తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ పూర్ణానంద్ సూచించారు. శ్రీ శారదా కళాశాల వద్ద ప్రారంభమైన ఈ 5కె వాకథాన్.. గుండె సంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ బీఆర్టీఎస్ రోడ్డులో కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జె. శ్రీమన్నారాయణ, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిన్నం రామకృష్ణ, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులు, అనేక మంది నగర పౌరులు పాల్గొన్నారు.

Check Also

వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చింది జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌మే

-పైగా కూట‌మి ప్ర‌భుత్వంపై బుర‌దజ‌ల్ల‌డం స‌మంజ‌స‌మేనా -రూ. 8540 కోట్ల‌కు గాను 1400 కోట్ల‌ను మాత్ర‌మే ఖ‌ర్చు చేశారు -విధ్వంసాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *