-మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయిడు
-ఘనంగా నివాళి అర్పించిన రాజకీయ ప్రముఖులు
-వర్తమాన రాజకీయ విశ్లేషకునిగా ఘనత వహించిన జెపి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ప్రతినిధిగా, రాజకీయ విశ్లేషకుని అడుసుమిల్లి జయప్రకాష్ ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయిడు అన్నారు. సోమవారం విజయవాడ శేషసాయి కళ్యాణమండపంలో దివంగత జయప్రకాష్ సంతాప కార్యక్రమం, పెద్దకర్మ నిర్వహించగా, పలువురు ప్రమఖులు హాజరై ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయిడు మాట్లాడుతూ విజయవాడ ప్రత్యక్ష రాజకీయలలో క్రియాశీలక పాత్ర పోషించారని, తుది శ్వాస విడిచే వరకు బెజవాడ రాజకీయాలలో తన పాత్రను పోషించారన్నారు. నమ్మిక సిద్దాంతం కోసం వెనకడుగు వేయకుండా పోరాటం చేసారన్నారు. తెలుగుదేశం పార్టీ తొలి శాసనసభ్యులలో ఒకరిగా ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన పాత్రను పోషించారన్నారు. విలువలు కలిగిన నేత చివరి వరకు విజయవాడ వికాసం పట్ల శ్రద్ద చూపారన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల నుండి వెనుదిరిగినా పరోక్ష రాజకీయాలలో క్రీయాశీలక పాత్ర పోషించేవారన్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ వ్యక్తిగతంగా మంచి స్నేహ పూర్వకంగా ఉండేవారన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, వెనిగళ్ల రాము, వివిధ పార్టీలకు చెందిన మాజీ ఎంపీలు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, కెవిపి రామచంద్రరావు, వడ్డే శోభనాదేశ్వరరావు, లగడపాటి రాజగోపాల్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు, మాజీ ఎంఎల్ ఎ మల్లాది విష్ణు, జయప్రకాష్ అభిమానులు, ఆయన కుమారుడు అడుసుమిల్లి శ్రీతిరుమలేష్, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయిడు, పౌరసరఫరాల శాఖ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తదితర ప్రముఖులు జేపీ మృతి అనంతరం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొలితరం శాననసభ్యునిగా 1983-1985 మధ్య కాలంలో అడుసుమిల్లి నగరానికి సేవలు అందించారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడైన అడుసుమిల్లి జయప్రకాశ్ 1983లో ఆ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తరువాత విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేసారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న జయప్రకాష్ హైదరాబాద్ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో లంగ్ ఇన్ఫెక్షన్ కు చికిత్చ పొందుతూ సెప్టెంబరు20వ తేదీన మృతి చెందారు. విద్యార్ది దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులైన జయప్రకాష్ కాంగ్రెస్ లో విద్యార్ధి నాయకునిగా పనిచేసారు. తరువాత నందమూరి తారక రామారావు పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి శాసన సభ్యునిగా గెలుపొందారు. కాకాని వెంకటరత్నం అనుచరుడుగా ఆంధ్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సమైక్యవాద ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించకుండా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న అడుసుమిల్లి జయప్రకాశ్ ఎన్నో రాజకీయ వ్యాసాలు రాయడమే కాక, టీవీ ఇంటర్వ్యూల్లో వర్తమాన రాజకీయాలను విశ్లేషించి మంచి రాజకీయ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు.