మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి బందరు పోర్టు ప్రారంభించుటకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి గురువారం తమ నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పర్యటించి స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం, డంపింగ్ యార్డ్ సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించడం, అదేవిధంగా బందరు పోర్టు ఆకస్మికంగా సందర్శించి పనులు పరిశీలించడం పట్ల, ఆయా సమస్యల పరిష్కారానికి, బందరు పోర్టు పనులు వేగవంతం చేయడానికి ఆదేశాలు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చారిత్రక ప్రాధాన్యత గల మచిలీపట్నాన్ని పట్టిపీడిస్తున్న చెత్త సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అవసరమైన అంచనాలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ప్రతిరోజు 100 టన్నుల చెత్త వస్తుందని, దీనిని రోజువారి డిస్పోస్ చేయడానికి కోన రోడ్డులో 13.50 ఎకరాలు గుర్తించినట్లు, సుమారు 12 కోట్లతో చెత్త సేకరించడంతో పాటు, చెత్తను సెగ్గ్రేట్ చేసి క్లియర్ చేయడానికి సుమారు 3 కోట్లతో ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 84 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను దశలవారీగా ఏడాదిలోగా క్లియర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నగరంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చేపట్టిన పనులు కొనసాగించడంతోపాటు, ఎత్తిపోతల ద్వారా వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తద్వారా ముంపు నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
నగరంలో మంచినీటి సమస్య పరిష్కారానికి యాదర వద్ద భూమి గుర్తించినట్లు, అదేవిధంగా మంగినపూడి వద్ద భూసేకరణ చర్యలు తీసుకుంటామన్నారు. జలజీవన్ మిషన్ కింద 220 కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయిలు మంజూరుకు పనులు చేపట్టుటకు త్వరగా టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మంగినపూడి బీచ్ వంటి వివిధ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ సర్క్యూట్ టూరిజం కింద స్వదేశీ దర్శన్ కేంద్ర పథకం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి పోర్టు ఆకస్మికంగా సందర్శించి ఆకస్మిక తనిఖీలకు ఇక్కడి నుంచి నాంది పలికారని, పోర్టు పనులు స్వయంగా పరిశీలించారని, రాజధానికి దగ్గరగా ఉండే బందరు పోర్టు బ్రిటిష్ కాలంలో విలసిల్లిన విధంగా అభివృద్ధి చేసేందుకు, 2025 డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేయుటకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇన్ లాండ్ వాటర్ వేస్ కింద అమరావతి నుండి నేరుగా పోర్టు వరకు బందరు కాలువ ద్వారా రవాణా అభివృద్ధి చేయడం ద్వారా పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బందర్ పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం, ఎంపెడ ద్వారా సుమారు 150 నుండి 200 కోట్లతో పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.
ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల ఆంధ్ర జాతీయ కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏ జే కళాశాలను టేకప్ చేయడంతో పాటు, క్రిటికల్ మైనింగ్ అంశంలో రీసెర్చ్ కోసం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రోల్డ్ గోల్డ్ పరిశ్రమను ఎమ్మెస్ ఎంఈ క్రింద క్లస్టర్ డెవలప్మెంట్ చేయడానికి, డిజైనింగ్ లో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు మచిలీపట్నం నుండి రేపల్లె- బాపట్ల రైల్వే లైన్ ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.