-తేమశాతం, గోనేసంచుల విషయంలో రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదు..
-ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి…
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, పౌర సరఫరాల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఎట్టి పరిస్ధితుల్లోను రైస్ మిల్లును సంప్రదించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో తేమ శాతం విషయంలో ఒకేసారి తేమ కొలిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఆయా రైతు సేవాకేంద్రాలవద్ద టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు మిల్లర్ల అసోషియేషన్ తరపున ఒకరిని ఉంచాలన్నారు. ధాన్యం రవాణాచేసే ప్రతి లారీలో ఖచ్చితంగా టార్పాలిన్ అందుబాటులో ఉంచాలన్నారు. గోనేసంచుల సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్ల దగ్గరకు రైతులు వెళ్లే అవకాశం కానీ, బ్రతిమలాడే పరిస్ధితి కానీ రాకూడదని ఆయన స్పష్టం చేశారు. రైతు గోనెసంచులు గానీ, హమాలీలు గానీ, రవాణా కానీ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ లెక్కలప్రకారం ఆ పైకం నేరుగా రైతు ఖాతాలోకి ధాన్యం సొమ్ముతో సహా చెల్లించబడుతుందనే విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ గోనెసంచుల విషయంలో రైస్ మిల్లులవద్దే వాటన్నింటిని పరిశీలించి సరైన రీతిలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే 7 లక్షల గోనెసంచులు అందుబాటులో ఉంచామన్నారు. గోనెసంచుల వినియోగానికి ఒక సంచికి(40 కేజిలు) రూ. 3.39 మరియు హామాలీ చార్జీలు క్వింటాకు రూ. 17.17కు ప్రభుత్వం రేటు ఆమోదించిందన్నారు. ధాన్యం ఎగుమతి చేసినదగ్గర నుండి రైస్ మిల్లువద్ద దిగుమతి అయ్యేవరకు జిపిఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడమైనదన్నారు. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.
ఈ సందర్బంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదుకాకుండా జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తామని రైస్ మిల్లర్స్ ప్రతినిధి ప్రభాకర్, ట్రాన్స్ పోర్టర్స సంఘం ప్రతినిధులు హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, డిఎఫ్ఓ రవీంధ్రదామా, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్. రాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి షేక్ హాబీబ్ భాషా, తదితరులు పాల్గొన్నారు.