మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని వినియోగదారులకు ఉచిత ఇసుకను అందించేందుకు టెండర్ ప్రక్రియ ద్వారా ఏజెన్సీని గుర్తించి ఖరారు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ఉదయం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రీచ్ లలో ఇసుక తవ్వి వాహనముల ద్వారా సమీపంలోని స్టాక్ యార్డులకు చేర్చడం, రవాణా నిమిత్తం ర్యాంపుల నిర్మాణం, అప్రోచ్ రహదారుల నిర్వహణ, స్టాక్ యార్డులలో వినియోగదారుల వాహనాలకు ఇసుక లోడింగ్ చేయడం వంటి ప్రక్రియలకు ఏజెన్సీలను గుర్తించేందుకు నిర్ణీత సమయంలోగా టెండర్ ప్రక్రియను చేపట్టి ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఏజెన్సీని ఖరారు చేసేందుకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా గనులు భూగర్భనరులు, రవాణా, ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. స్టాక్ యార్డుకు కనీసం ఇద్దరు చొప్పున షిఫ్ట్ పద్ధతిలో పోలీసు, రెవెన్యూ సిబ్బందిని నియమించడం, సీసీటీవీ ల ఏర్పాటు, మొబైల్ ఫోన్లు, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు ఇసుక రీచ్ లకు సరిహద్దులను నిర్ణయించి సీసీ పిల్లర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
తాడిగడప మున్సిపాలిటీకు మంజూరైన పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఏ ఎస్ పి ప్రసాద్, బందరు ఆర్డిఓ కే స్వాతి, గనులు భూగర్భ వనరుల శాఖ ఏడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.