-ఆకట్టుకున్న చిన్నారుల కళా ప్రదర్శనలు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా కళాకారులు అమ్మవారికి కళాభిషేకం చేస్తున్నారు. ఐదో రోజు అమ్మవారు మహా చండీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కళా ప్రదర్శనలు తిలకించి పరవశించిపోతున్నారు. సోమవారం కనకదుర్గ నగర్ లోని కళావేదికపై రామాంజనేయుల బృందం, దీపిక, పార్థసారథి ఆలపించిన భజన సంకీర్తనలు వీనుల విందుగా ఓలలాడించాయి. కళాకారులు దుర్గేష్, నందిని సంగీత విభావరి వినసొంపుగా సాగింది. అమ్మవారిని పూజిస్తూ మైమరిచిపోతూ ఆలపించారు. నృత్య కళాకారులు శ్రీరామచంద్రమూర్తి, సత్యవాణి, సౌమ్య, నవ్య ప్రదర్శించిన కళారూపాలు వీక్షకులను కట్టిపడేసాయి. అదే కోవలో అలేఖ్య, రంజిత్, నీరజ గీత, లీలావతి, విజయలక్ష్మి, వాత్సల్య నృత్యాలు అమ్మవారి విశిష్టతను కళ్ళ ముందు కళ్ళముందు సాక్షాత్కరింప చేశాయి. సిహెచ్ నాగబాబు హరికథ ఆకట్టుకుంది.
చదువుతోపాటు చిన్నారులు లలిత కళలపై భక్తి భావంతో ఇటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవడం అభినందనీయమని ప్రేక్షకులు అభినందించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇటువంటి కళారూపాలను చూసి భక్తితత్వంతో ఆనందానికి లోనవుతున్నారు.