-ముత్తయిదువులను స్వయంగా పూజా మందిరంలోకి తోడ్కోని వెళ్లిన ఆలయ ఈవో కె.ఎస్.రామరావు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారి వివిధ రూపాలకు అనుగుణంగా ఏటా ఇంద్రకీలాద్రిపై నిర్వహించే సువాసినీ పూజ సోమవారం వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్దంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు స్వయంగా ముత్తయిదువులను పూజా మందిరానికి తోడ్కోని వెళ్లారు. బాల..కుమారి.. సువాసిని… పూజలు ఈ సందర్భంలోనే జరుగుతుంటాయి. సువాసినీ పూజలో ముత్తయిదువులను అమ్మవారిగా భావించి అలంకరించడం, పూజించడం ఆనవాయితీగా వస్తుంది. పూజానంతరం తరువాత వారికి దక్షిణ తాంబూలం ఇస్తుంటారు. ఇక తాంబూలంతో పాటుగా కొందరు పసుపు, కుంకుమ, అద్దం, దువ్వెన వంటివి ఇస్తుంటారు. మరికొందరు వీటికి వస్త్రం – వక్కలు జోడిస్తారు. పూజానంతరం పాల్గొన్న ముత్తయిదువులుకు తొమ్మిది వస్తువులను శాస్త్రం మేరకు వారికి బహుకరించారు. అనంతరం పూజలో పాల్గొన్న వారికి అమ్మవారి దర్శనం కల్పించారు.