-రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు.
-జీవితంలో ముందుకెళ్లాలంటే ఆరోగ్యం అత్యంత ప్రధానం.
-రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎం.బబిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావంతో విజయవాడలోని అనేక ప్రాంత ప్రజలు ఇబ్బందిపడ్డారని.. మనం హాయిగా జీవించాలన్నా, జీవితంలో ముందుకెళ్లాలన్నా ఆరోగ్యంగా ఉండటం అత్యంత ముఖ్యమని, అందుకే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్) ఎం.బబిత తెలిపారు.
శనివారం విజయవాడ అర్బన్ పరిధిలోని న్యూ వాంబే కాలనీ యూపీహెచ్‌సీలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎం.బబిత.. సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎ.సత్యానంద్, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.బబిత మాట్లాడుతూ గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, గౌరవ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ మార్గనిర్దేశనంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్ శాఖ సహకారంతో శిబిరాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ శిబిరం ద్వారా వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు కార్డియాలజిస్టుతో పాటు గైనకాలజిస్టు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, ఫిజీషియన్ తదితర స్పెషలిస్టు వైద్య సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే విధంగా రూ. 3 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు, మహిళలు, పిల్లలు, ఎస్‌సీ, ఎస్‌టీలు, వరదలు వంటి విపత్తు ప్రభావిత ప్రజలు తదితరులకు న్యాయ సలహా, సహాయం కోసం ఉచితంగా లాయర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకు జిల్లా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించొచ్చని తెలిపారు. అదేవిధంగా 15100 హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబరుకు కూడా ఫోన్ చేయొచ్చని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎం.బబిత వివరించారు.
63 రకాల వైద్య పరీక్షలు: డా. ఎం.సుహాసిని
డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని మాట్లాడుతూ వరద ప్రభావానికి వాంబే కాలనీ తీవ్ర ప్రభావానికి గురైందని.. ఇక్కడి ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు స్పెషలిస్టు వైద్యులతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసీజీ, ఎకో పరీక్షల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 63 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు డా. ఎం.సుహాసిని వివరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ సెక్రటరీ డా. హెచ్.అమర రంగేశ్వరరావు, సీఐ వెంకటేశ్వర్లు, డీపీఎంవో డా. నవీన్, డీపీవో మహేశ్, న్యాయ సేవాధికార సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.