– ఈ నెల 22న సాయంత్రం 6.30 గం. నుంచి 8 గం. వరకు సాంస్కృతిక సంరంభం.
– అయిదు వేలకు పైగా డ్రోన్లతో రికార్డుస్థాయి డ్రోన్ షోకు కసరత్తు.
– లేజర్ బీమ్ షో, మ్యూజిక్ బ్యాండ్, బాణసంచా వెలుగు జిలుగులు కూడా.
– డ్రోన్ సమ్మిట్-ప్రత్యేక కార్యక్రమాల విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
– జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా
– కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు: సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని డ్రోన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహించనుందని.. ఇందులో భాగంగా 22వ తేదీ సాయంత్రం 6.30 గం. నుంచి 8 గం. వరకు కృష్ణమ్మ ఒడ్డున కల్చరల్ ఈవెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనుందని.. అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాల విజయవంతానికి కృషిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఆదేశించారు.
డ్రోన్ సదస్సు-భారీ డ్రోన్ షోపై శనివారం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా, సీపీ ఎస్‌వీ రాజేశేఖరబాబు.. ఉన్నతాధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిధి మీనా మాట్లాడుతూ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఈ నెల 22, 23న రెండురోజుల పాటు సదస్సు జరుగుతుందని.. అదే విధంగా 22వ తేదీ సాయంత్రం పున్నమిఘాట్-బబ్బూరి గ్రౌండ్స్ వరకు కల్చరల్ ఈవెనింగ్ కార్యక్రమం జరగనుందన్నారు. ఇందులో భాగంగా దేశంలో గతంలో ఎన్నడూలేని విధంగా అయిదువేలకు పైబడి డ్రోన్లతో భారీ డ్రోన్‌షో ఉంటుందని.. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వి-అన్‌బీటబుల్, లేజర్ బీమ్ షో, గ్రాండ్ ఫైర్ వర్క్స్, మ్యూజిక్ బ్యాండ్ తదితర ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం సాఫీగా జరగడానికి నియమించిన ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులుతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, డెలిగేట్స్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రతి అంశంపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. వీవీఐపీ, వీఐపీ, పబ్లిక్ గ్యాలరీ.. ఇలా వివిధ గ్యాలరీల ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. అతిథులకు సీటింగ్ అరేంజ్‌మెంట్ సరైన విధంగా ఉండేలా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు వసతి తదితరాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా బోట్లతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని నిధి మీనా ఆదేశించారు.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం: సీపీ రాజశేఖరబాబు
డ్రోన్ సదస్సు-భారీ డ్రోన్‌షో, కల్చరల్ ఈవెనింగ్ కార్యక్రమాల విజయవంతానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమాల నిర్వహణకు కృషిచేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. కృష్ణానది తీరంలో కార్యక్రమాలు జరిగే ప్రాంగణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతిథులు, ప్రజలు చేరుకునేందుకు వీలుగా పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా వీవీఐపీ, వీఐపీ, జనరల్ పబ్లిక్ వారీగా పార్కింగ్, బ్యారికేడింగ్ పైనా ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వివరించారు. అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుతున్నట్లు రాజశేఖరబాబు తెలిపారు.
సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సమన్వయ సమావేశం అనంతరం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర తదితరులు బబ్బూరి గ్రౌండ్స్‌తో పాటు పున్నమిఘాట్ ప్రాంతాలను పరిశీలించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు.