మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రధానంగా ఆక్వా కల్చర్, పామ్ ఆయిల్, టూరిజం వంటి రంగాల్లో అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం జిల్లా కలెక్టర్లతో అమరావతి సచివాలయం నుండి స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ పై సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ గురించి సీఎస్ గారికి వివరించారు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలైన ఆక్వా కల్చర్, నాచురల్ ఫార్మింగ్ , వాణిజ్య పంటలైన ఆయిల్ పామ్ అభివృద్ధికి, టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా అభివృద్ధికి మల్లవల్లి పారిశ్రామిక వాడ మరో గ్రోత్ ఇంజన్ కాగలదని అన్నారు. ఈ అంశాలన్నింటిని జిల్లా విజన్ డాక్యుమెంట్లో పొందు పరచడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లా మండల స్థాయి విజన్ డాక్యుమెంట్లు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందన్నారు. సిపిఓ గణేష్ కృష్ణ, డ్వామా పిడి కె వి శివప్రసాద్, హౌసింగ్ పీడీ ఎస్ వెంకట్రావు, పరిశ్రమల శాఖ జిఎం ఆర్ వెంకట్రావు, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర రావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.