Breaking News

అల్ప సంఖ్యాక వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్దిచేకూర్చాలి…

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, అభివృద్దికై ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను మరింత పటిష్టంగా అమలుపరుస్తూ ఆయా వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్దిచేకూర్చాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లోని తన ఛాంబరునందు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.ఎం.డి.ఇంతియాజ్, కమిషనర్ శారదా దేవి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సి.ఇ.ఓ. ఎస్.అలీమ్ బాషా తదితరులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారులు, వర్కు ఇన్ స్పెక్టర్లు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో బుధవారం రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న సమీక్షాసమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రాధమికంగా అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అల్పసంఖ్యాక వర్గాల ప్రజలను సామాజికంగా, అర్థికంగా అభివృద్ది పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమాన్నిరాష్ట్రంలో పటిష్టంగా అమలు పర్చే అంశంపై అధికారులు ప్రత్యేక శ్రద్దచూపాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని వక్పు బోర్డు భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని, వాటి పరిరక్షణకై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. భూముల అన్యాక్రాంతానికి సంబందించి కోర్టులో పెండింగ్ లోనున్న పలు కేసుల సత్వర పరిష్కానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన వక్పు బోర్డు భూముల్లో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు జరుగకుండా చూడాలని, అటు వంటి నిర్మాణాలకు మున్సిఫల్ అధికారులు అనుమతులు మంజూరు చేయకుండా ఉండేందుకై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను కూడా వక్ఫ్ బోర్డులో మెంబర్లుగా చేర్చుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. వక్ఫ్ బోర్డు భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఉండేందుకై వక్ఫ్ బోర్డు భూముల వివరాలను ముందుగా రిజిస్ట్రేషన్ అధికారులకు అందజేసి వారిని అప్రమత్తం చేయాలన్నారు.
రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కమిషనర్ శారదా దేవి రాష్ట్రంలో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, అభివృద్దికై అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల వివరాలను, వాటి ప్రగతిని మంత్రికి వివరించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సి.ఇ.ఓ. అలీమ్ బాషా రాష్ట్రంలో వక్పు బోర్డు భూముల పరిరక్షణకు, కోర్టుల్లో పెండింగ్ లోనున్న పలు కేసుల సత్వర పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు.
రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్, రాష్ట్ర నూర్ బాషా దూదేకుల ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదమ్ సాహెబ్, అల్పసంఖ్యాక వర్గాల విద్య అభివృద్ది కేంద్రం డైరెక్టర్ ఎస్.మస్తాన్ వలీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *