మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు పక్కాగా చేయాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి,మత్స్యశాఖ కార్యదర్శి ముదావతు ఎం. నాయక్ బి ఎల్ ఓ లకు సూచించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం నగరానికి విచ్చేసిన ఓటర్ల జాబితా పరిశీలకులు కలెక్టరేట్లో ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం నగరంలోని శ్రీ పాండురంగ స్వామి ఉన్నత పాఠశాల లో 42 నుండి 45 సంఖ్య వరకు ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పరిశీలకులు ఓటర్ల దరఖాస్తులు స్వీకరణ, నమోదు, చేర్పులు, మార్పుల గురించి వివరాలను బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బి ఎల్ ఓ మొబైల్ యాప్ ఉందని అందులో లాగిన్ అయి ఓటర్ నమోదు చేస్తామని వారు పరిశీలకులకు వివరించారు. ఆఫ్లైన్ దరఖాస్తుల కంటే ఆన్లైన్లో దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని వారు పరిశీలకులకు తెలిపారు.
ఓటర్ల నుండి ఆధార్ కార్డు తీసుకుంటున్నారా లేదా అని విచారించి డూప్లికేట్ ఓటర్లను ఎలా గుర్తిస్తున్నారని ఆరా తీయగా ఆధార్ కార్డులు అందరూ ఇవ్వడం లేదని, ఇంటిపేరు, ఇంటి చిరునామా ఆధారంగా డూప్లికేట్ ఓటర్లను గుర్తించి తొలగిస్తున్నామని, అలాగే చనిపోయిన ఓటర్లను కూడా తొలగిస్తున్నామని బిఎల్వోలు పరిశీలకులకు వివరించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో పరిశీలకుల వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, మచిలీపట్నం ఆర్డిఓ కే. స్వాతి, తహసిల్దారు మధుసూదన్, బిఎల్వోలు పవన్ కుమార్, రమ్య, శివరామకృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.