గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతన వెండింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని, డిశంబర్ 10వ తేదీలోపు వెండింగ్ జోన్లను ఫైనల్ చేసుకోవడానికి వీధి వ్యాపారులు, ఆయా సంఘాల ప్రతినిధులు సహకరించాలని, రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వీధి వ్యాపారుల సమస్యలు, వెండింగ్ కమిటి ఏర్పాటు, వెండింగ్ జోన్ల నిర్ధారణ తదితర అంశాలపై వెండింగ్ కమిటి సభ్యులు, ట్రాఫిక్, ఆర్ & బి, ట్రాన్స్పోర్ట్, మెప్మా, సిపిడిసిఎల్, జిఎంసి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తొలుత వెండర్స్ కమిటి సభ్యులను ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలు, జోన్ల ఏర్పాటు, గుర్తింపు కార్డ్ ల పంపిణీ పై వివరాలు అడిగి తెలుసుకొని మాట్లాడుతూ వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి, వారికి మెరుగైన సంక్షేమ చర్యలు తీసుకోవడానికి ముందుంటామన్నారు. కాని వీధి వ్యాపారుల దగ్గర అద్దెలు పేరుతొ దోచుకుంటున్న దళారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అత్యవసరంగా వెండింగ్ జోన్లను నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు తొలుత నూతన వెండింగ్ కమిటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కమిటిలో చట్ట ప్రకారం కేవలం వీధి వ్యాపారులు, ఆయా డిపార్ట్మెంట్ అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రమే సభ్యులుగా ఉంటారన్నారు. కమిటి ఏర్పాటు అనంతరం డిశంబర్ 10 నాటికి జోన్లను ఫైనల్ చేసుకునే లక్ష్యంతో స్థలాల పరిశీలన చేయాలన్నారు. ఆయా స్థలాలు వీధి వ్యాపారులు నిర్భయంగా, స్వేచ్చగా ఏవిధమైన దోపిడీకి గురి కాకుండా వ్యాపారం చేసుకునేలా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర మంత్రివర్యులు, గుంటూరు పశ్శిమ, తూర్పు, ప్రత్తిపాడు ఎంఎల్ఏలు కూడా వీధి వ్యాపారుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు. జోన్ల ఏర్పాటు వలన ఆయా వ్యాపారస్తులకు గుర్తింపు కార్డ్ లు, పిఎం స్వానిధి బ్యాంక్ రుణాలు వంటి అనేక సంక్షేమ పధకాలు అందుతాయన్నారు. జోన్ల మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, అవసరమైతే వెండింగ్ కమిటి సభ్యులను జిఎంసి ఖర్చులతో వెండింగ్ జోన్లు అమలు చేస్తున్న నగరాల పరిశీలనకు పంపుతామన్నారు. రోడ్లు, పుట్ పాత్ లు, డ్రైన్లు ఆక్రమణలను దశల వారీగా తొలగిస్తామని తెలిపారు. తొలగించిన ప్రాంతాల్లో వాస్తవంగా వీధి వ్యాపారాలు చేసుకునే వారు అర్జీలు ఇస్తే వారికి తాత్కాలికంగా వ్యాపారం చేసుకోవడానికి స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 14 నుండి జిఎంసి ప్రధాన కార్యాలయంలో వీధి వ్యాపారుల గుర్తింపు దరఖాస్తులను ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అందిస్తామని, వీధి వ్యాపారులు దరఖాస్తు పూర్తి చేసి, అదే కౌంటర్ లో అందిస్తే వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, గుర్తింపు కార్డ్ లు అందిస్తామని తెలిపారు.
సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, మెప్మా పిడి జె.రామారావు, వెండర్స్ కమిటి సభ్యులు, ట్రాఫిక్, సిపిడిసిఎల్, ట్రాన్స్పోర్ట్, మెప్మా అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …