Breaking News

నగర రహదారులకు టోల్ బాదుడుపై మల్లాది విష్ణు సీరియస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర రహదారులలో ప్రయాణించే వాహనాలపై టోల్‌ బాదుడుకి ప్రభుత్వం సిద్ధమవడంపై వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై భారాలు వేసేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తోందని దుయ్యబట్టారు. ఇంతవరకు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు మాత్రమే టోల్‌ ఫీజు వసూలు చేసేవారని.. కానీ నగర రహదారులపై ప్రయాణించే వాహనాలకు కూడా టోల్‌ ఫీజు వసూలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కు కట్టబెట్టడమేనని.. పదేళ్ల పాటు వ్యాపార ప్రకటనలు, హోర్డింగుల ద్వారా కార్పొరేషన్ కు వచ్చే ఆదాయానికి కూడా గండిపడుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలోని 16 నగరాల్లో ఉన్న 642.90 కిలోమీటర్ల మేర రోడ్లపై టోల్ బాదుడుకు ప్రభుత్వం సిద్ధమవగా.. విజయవాడ నగరంలో 23 కి.మీ. మేర 17 రహదారుల నిర్వహణను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు చూస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇదే జరిగితే సెంట్రల్ పరిధిలోని బీర్టీఎస్ రోడ్, సాంబమూర్తి రోడ్, జీఎస్ రాజు రోడ్ సహా 7.3 కి.మీ. మేర బిజీగా ఉండే రహదారులపై అడుగు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో రహదారి కూడా 5 నుంచి 6 డివిజన్లను కలుపుతూ ఉంటుందని.. టోల్ వసూలుతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎంతగా నష్టపోతారో ఒక్కసారి ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు రెండు నియోజకవర్గాల మధ్య అనుసంధానంగా.. వందలాది మంది పేషంట్లు నిత్యం వస్తూపోతూ రద్దీగా ఉంటుందన్నారు. అటువంటి రహదారిలో టోల్ వసూలు చేయడంలో ప్రభుత్వ ఉద్దేశమేమిటని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఎక్కడా రోడ్లు బాగోలేవంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు రోడ్ల అభివృద్ధి పేరుతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టేందుకు చూస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతానంటూ ఎన్నికల ముందు బాబు చెప్పిన మాటలను ప్రజలు నమ్మారని.. కానీ నేడు రహదారుల్లో గుంతలను పూడ్చడానికి కూడా టోల్‌ ఫీజులు వసూలు చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఆలోచన రహదారులను బాగుచేయటమా..? లేక ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడం కోసమా..? సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, ఐడియాలు మాత్రం చాలా ఉన్నాయని చెప్పిన చంద్రబాబు.. చివరకు ప్రజలపై భారాలు మోపుతున్నారని నిప్పులు చెరిగారు. 6 నెలల కాలంలో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటగా.. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ. 15 వేల కోట్ల భారం వేశారని ధ్వజమెత్తారు. మరలా ఇప్పుడు రాష్ట్ర రహదారులతో పాటు నగరపాలక సంస్థ సెంట్రల్ పరిధిలోని రోడ్లకు కూడా టోల్‌ చార్జీలు వసూలు చేస్తూ.. ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తారా..? రోడ్లను అభివృద్ధి చేయ‌డం, వాటిని స‌క్రమంగా నిర్వహించ‌డం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత‌ని.. అంతేకానీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ చేతుల్లో పెట్టడం కాదని తెలిపారు. ఈ ప్రతిపాద‌న రాష్ట్ర ర‌వాణా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుంద‌ని, అయినా ఇప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే.. తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *