– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పూలే వర్థంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి గురువారం ఘన నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అంటూ పూలే సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందని మల్లాది విష్ణు తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంతో పాటు మహిళలను ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు. అలాగే స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం పాటించి వైఎస్ జగన్ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేసిందని విమర్శించారు. చంద్రబాబు తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అతీగతీ లేదని.. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాల ఊసే లేదన్నారు. ఆరు నెలల పాలనలో ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా 60 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారని.. ఇదేనా సంపద సృష్టి అంటూ ఎద్దేవా చేశారు. పైగా విజన్ 2047 పేరుతో కలలు కంటూ బ్రతికేయమని చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అసమర్థ పాలనపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మల్లాది విష్ణు చెప్పారు. ముఖ్యంగా కూటమి నేతలకు జమిలీ ఎన్నికల భయం పట్టుకుందని.. త్వరలోనే ఈ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే సామాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయన్న పూలే ఆలోచన విధానమే స్ఫూర్తిగా.. ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు యరగొర్ల శ్రీరాములు, వెన్నం రత్నారావు, అక్బర్, పసుపులేటి యేసు, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణిరెడ్డి, వెంకటేశ్వరమ్మ, ఇస్మాయిల్, కురిటి శివ, మీసాల సత్యనారాయణ, ఆర్.ఎస్.నాయుడు, ప్రబల శ్రీనివాస్, ఎం.ఎస్.నారాయణ, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.