-సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టండి
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా బోధన అందించి.. ఫలితాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేలా కృషిచేయాలని, సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి విద్యార్థుల సమగ్రాభివృద్దికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత డా. లక్ష్మీశ తొలి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, అధికారులతో కలిసి ఎ.కొండూరులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి, త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో ముచ్చటించి విద్యా బోధన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత కీలకమైన ఎన్‌టీఆర్ జిల్లా విద్యలకు నిలయంగా గుర్తింపు పొందిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించి ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషిచేయాల్సిన అవసరముందన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు ప్రాథమిక పరీక్షలకు నిర్వహించి విద్యలో వెనుకబడిన వారిని గుర్తించి, ప్రత్యేక దృష్టిపెట్టడంతో పాటు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం మరింత ప్రత్యేక దృష్టిపెట్టడం జరిగిందని.. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసిన మెనూ ప్రకారం పథకాన్ని అమలుచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా కస్తూరిబా బాలికా విద్యాలయంలో భోజన, వసతి సౌకర్యాలపై మరింత దృష్టిసారించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో తరచు సమావేశాలు నిర్వహించి, విద్యార్థుల స్థితిగతులను వివరించి ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించేందుకు కృషిచేయాలన్నారు.
ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం:
ఎ.కొండూరు డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి తిరిగివెళ్తూ మార్గం మధ్యలో కలెక్టర్ ఓ రైతుతో ముచ్చటించారు. ఆయన పండించిన ధాన్యాన్ని పరిశీలించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం ద్వారా విక్రయించుకొని మద్దతు ధర పొందేలా కృషిచేస్తున్నామన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని రైతాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతులకు అండగా నిలిచి ఎలాంటి నష్టం జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయా అధికారులను ఆదేశించామన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రైవేటు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించడం జరిగిందన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందించి ప్రభుత్వ పరంగా వెన్నంటి ఉంటామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.