Breaking News

స‌మ‌ష్టి బాధ్య‌త‌తో స‌మ‌గ్రాభివృద్ధి సాధిద్ధాం..

– స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల అడుగులు
– ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల మెరుగుకు చ‌ర్య‌లు
– కీల‌క‌మైన ఎన్‌టీఆర్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు కృషి
– విజ‌య‌వాడ ప్రాంతాన్ని ఇండ‌స్ట్రీ హ‌బ్‌గా మార్చేందుకు చొర‌వ‌
– సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌ల్లో జిల్లాను ముందు నిలుపుదాం
– జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌మ‌ష్టి బాధ్య‌త‌తో జిల్లా స‌మ‌గ్రాభివృద్ధి చెందేలా కృషిచేద్దామని.. స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు అడుగులు వేయాల‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు.
శ‌నివారం విజ‌య‌వాడ‌, ఇరిగేషన్ కాంపౌండ్‌లోని రైతు శిక్ష‌ణ కేంద్రంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న జిల్లా స‌మీక్షా క‌మిటీ (డీఆర్‌సీ) స‌మావేశం జ‌రిగింది. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, ప్ర‌భుత్వ విప్‌లు తంగిరాల సౌమ్య‌, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశా, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్ త‌దిత‌రుల‌తో క‌లిసి జిల్లాలో 34 శాఖ‌ల ప‌రిధిలోని అభివృద్ధి ప‌నులు, కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్షించారు. ఎమ్మెల్సీ కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుతో పాటు మైల‌వ‌రం, జ‌గ్గ‌య్య‌పేట‌, తిరువూరు శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణప్ర‌సాద్‌, శ్రీరాం రాజ‌గోపాల్ తాత‌య్య‌, కొలిక‌పూడి శ్రీనివాస‌రావు త‌దిత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు ఈ స‌మావేశానికి హాజ‌రుకాగా వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, మార్కెటింగ్‌, ఇరిగేష‌న్‌, వైద్య ఆరోగ్యం, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, ప‌ర్యాట‌కం, గృహ నిర్మాణం, ఆర్ అండ్ బీ, విద్య‌.. ఇలా
శాఖ‌ల వారీగా ప్ర‌స్తుతం పురోగ‌తిలో ఉన్న ప‌నులు, స‌మ‌స్య‌లు, ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.
ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, భారీ వ‌ర్షాల కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాల‌కు దాదాపు రూ. 304.08 కోట్లు ప‌రిహారం అందించ‌డం జ‌రిగింద‌ని అధికారులు వివ‌రించ‌గా.. గౌర‌వ ముఖ్య‌మంత్రి నిరంత‌ర మార్గ‌నిర్దేశ‌నంతో రికార్డు స్థాయిలో ఆర్థిక స‌హాయం పంపిణీ చేశామ‌ని అధికారులు వివ‌రించారు. ఆర్థిక స‌హ‌కారానికి సంబంధించి అర్జీలను త‌హ‌శీల్దార్‌, ఆర్‌డీవో, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల‌కు స‌మ‌ర్పించ‌వ‌చ్చ‌ని, ప‌బ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ సిస్ట‌మ్ (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మంలోనూ అర్జీలు ఇవ్వొచ్చ‌ని, వీటిని ప‌రిశీలించి స‌త్వ‌రం అర్హ‌త మేర‌కు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.

రైతుల‌కు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాలి:
వ్య‌వ‌సాయ శాఖ స‌మీక్ష‌లో భాగంగా ర‌బీ 2024-25కు సంబంధించి రాయితీపై రైతుల‌కు విత్త‌నాలు అందించేందుకు జిల్లాకు చేసిన కేటాయింపులతో పాటు భూసార ప‌రీక్ష‌ల‌కు సంబంధించి 11,200 శాంపిళ్లు తీసుకొని విశ్లేషించి, రైతుల‌కు సూచ‌న‌లు చేయ‌డం జ‌రిగింద‌ని అధికారులు వివ‌రించారు. అధునాత సాంకేతిక‌త‌ల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు, వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మార్చుకునేందుకు ప్ర‌తి మంగ‌ళ‌, బుధ‌వారాల్లో పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. రైతుల పంట ఉత్ప‌త్తుల‌కు మంచి మార్కెటింగ్ అవ‌కాశాలు క‌ల్పించేందుకు వీలుక‌ల్పించే ఇండ్‌.గ్యాప్ స‌ర్టిఫికేష‌న్‌పై ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌కృతి వైప‌రీత్యాలతో పంట దిగుబ‌డి న‌ష్ట‌పోయిన సంద‌ర్భంలో రైతుకు భ‌రోసా క‌ల్పించేలా వ్య‌వ‌సాయ ఆదాయ స్థిరీక‌ర‌ణ‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న (పీఎంఎఫ్‌బీవై)ను అమ‌లుచేస్తున్నాయ‌న్నారు. ఎన్‌టీఆర్ జిల్లాలో ప‌థ‌కం అమ‌లుకు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. వ‌రి, మొక్కజొన్న‌ల‌కు ఎక‌రాకు రూ. 42 వేలు బీమా మొత్తానికి రూ. 126 ప్రీమియం, శెన‌గ‌ల‌కు ఎక‌రాకు రూ. 28 వేలు బీమా మొత్తానికి రూ. 56 ప్రీమియం రైతులు చెల్లించాల్సి ఉంటుంది.. ఈ ప‌థ‌కంలో చేరేందుకు వ‌రికి డిసెంబ‌ర్ 31లోగా, మొక్క‌జొన్న‌, శెన‌గ‌ల‌కు డిసెంబ‌ర్ 15లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. ఈ ప‌థ‌కంపైనా రైతుల‌కు క్షేత్ర‌స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల్సి ఉంద‌న్నారు. అదేవిధంగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంపు, మామిడికి ప్రోత్సాహానికి చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంద‌న్నారు.

స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించిన ప్ర‌జాప్ర‌తినిధులు:
స‌మావేశంలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వివిధ అంశాల‌ను స‌మావేశంలో ప్ర‌స్తావించారు. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న బాధితుల‌కు ఆర్థిక స‌హాయం, వ‌ర‌ద ప్ర‌భావంతో దెబ్బ‌తిన్న పాఠ‌శాల‌ల ఆధునికీక‌ర‌ణ‌, జి.కొండూరు తార‌క‌రామ ఎత్తిపోత‌ల ప‌థ‌కం మోటార్లను పున‌రుద్ధ‌రించి 13 వేల ఎక‌రాల‌కు సాగునీరందించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లు, తుమ్మ‌ల‌పాలెం ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి అంత‌రాయాలు లేని విద్యుత్ సౌక‌ర్యం, సాగుభూముల్లో ఇసుక మేటల‌తో ఇబ్బందిప‌డుతున్న రైతుల‌కు సాయం, ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు సంబంధించిన మ‌హ‌నీయుల విగ్ర‌హాల ఏర్పాటు త‌దిత‌ర అంశాలను ప్రస్తావించారు. స‌న్న, చిన్న‌కారు ప‌త్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు. మార్కెట్ యార్డుల ఆదాయంలో 20 శాతాన్ని లింకు రోడ్ల అభివృద్ధికి ఖ‌ర్చుచేసే విష‌యంతో పాటు రైతు బ‌జార్ల సంఖ్యను పెంచాల్సిన అవ‌స‌రం, ప్ర‌స్తుత‌మున్న రైతు బ‌జార్ల ప్ర‌క్షాళ‌న త‌దిత‌ర అంశాలపైనా చ‌ర్చించ‌డం జ‌రిగింది.

గ్రేట‌ర్ విజ‌య‌వాడ‌తో అనేక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం:
స‌మావేశంలో భాగంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ గ్రేట‌ర్ విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ విధానంతో క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను స‌మావేశంలో ప్ర‌స్తావించారు. అర్బ‌న్ ప్రాంతంతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల స‌త్వ‌ర అభివృద్ధికి, స‌మ‌స్య‌ల త‌క్ష‌ణ ప‌రిష్కారానికి దీంతో లాభం చేకూరుతుంద‌న్నారు. దీనిపైనా చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. విజ‌య‌వాడ అర్బ‌న్ ప్రాంతంలో ఏ శాఖ‌కు సంబంధించి అయినా ఓ ప్రాజెక్టు చేప‌ట్టిన‌ప్పుడు ప్లానింగ్ ద‌శ‌లోనే స‌మ‌న్వ‌య శాఖ‌ల స‌మావేశాలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: ఇన్‌ఛార్జ్ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌
ప్ర‌జాప్ర‌తినిధులు లేవ‌నెత్తిన అంశాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి.. స‌మ‌న్వ‌యంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయ‌నున్న‌ట్లు ఇన్‌ఛార్జ్ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. త్వ‌ర‌లోనే మరోసారి సమావేశ‌మై కార్య‌క్ర‌మాల పురోగ‌తిపై స‌మ‌గ్రంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌హ‌నీయుల విగ్ర‌హాల ఏర్పాటు అంశాన్ని గౌర‌వ ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి మూడు నెల‌ల‌కు క్ర‌మంత‌ప్ప‌కుండా డీఆర్‌సీ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.
గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆధ్వర్యంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు వ‌ర‌ద‌ల స‌మ‌యంలో చేసిన కృషి అత్యంత ప్ర‌శంస‌నీయ‌మైంద‌ని ఇన్‌ఛార్జ్ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు.
స‌మావేశంలో విజ‌య‌వాడ‌, నందిగామ‌, తిరువూరు ఆర్‌డీవోలు కావూరి చైత‌న్య‌, కె.బాల‌కృష్ణ‌, కె.మాధురి, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

డీఆర్‌సీ అభివృద్ధికి దిక్సూచి: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
జిల్లా స‌మీక్షా క‌మిటీ (డీఆర్‌సీ).. జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి దిక్సూచి అని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. వివిధ శాఖ‌ల ప‌రిధిలో అమ‌ల‌య్యే కార్య‌క్ర‌మాల ద్వారా మంచి ఫ‌లితాలు వ‌చ్చేందుకు భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు ఈ స‌మావేశం మార్గ‌ద‌ర్శినిగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. నిర్మాణాత్మ‌క చ‌ర్చ జరిగే క్ర‌మంలో గౌర‌వ ప్ర‌జాప్ర‌తినిధులు ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని టీమ్ ఎన్‌టీఆర్ జిల్లా అభివృద్ధికి కృషిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *