-వందకు పైగా స్టాల్స్ తో నవంబర్ 22న ఎగ్జిబిషన్ ప్రారంభం..
-ఇప్పటివరకు 40 వేల మందికి పైగా ప్రజలు సందర్శించారు ..
-డిసెంబర్ 1 వరకు హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన..
– ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ, ఎండీ ఎం. విశ్వ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మేరీస్ స్టెల్లా ఆడిటోరియం, పంట కాల్వ రోడ్డులో నవంబర్ 22వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన లేపాక్షి గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ రేపటితో (డిసెంబర్ 1) ముగియనుందని ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ, ఎండీ ఎం. విశ్వ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ శిల్పబజార్‌లో డిసెంబర్ ఒకటో తేదీ వరకు హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ ప్రదర్శన ద్వారా ఇప్పటివరకు (9రోజులపాటు) రూ.60 లక్షలకు పైగా విక్రయాలు జరగ్గా.. సుమారు 40 వేలమందికి పైగా ప్రజలు సందర్శించారని తెలిపారు.
ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తక ళాకారులు తమ కళానైపుణ్యంతో తయారుచేసిన ఉత్పత్తులను 100కి పైగా స్టాల్స్ ద్వారా ప్రదర్శనకు ఉంచారని చెప్పారు. ప్రతి ఏడాది ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ సంవత్సరం అమ్మకాలు ఎక్కువ జరిగాయన్నారు. విజయవాడ నగరవాసులకు మరింత వన్నె తెచ్చే టెక్స్ టైల్స్, బేంబూ స్టోన్స్, ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జువెలరీ, కార్పెట్స్, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై చీరలు, ఉడ్ కార్వింగ్, లేస్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు, బాటిక్ ప్రింట్స్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, వీటిని వినియోగించుకోవాలని విశ్వ ప్రకటన ద్వారా కోరారు.