Breaking News

సెప్టెంబర్ 27న రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు:రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దుర్గేష్ కీలక సమీక్ష.. గోదావరి పుష్కరాలు, ఇన్-బౌండ్ టూరిజం వృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ
-రాష్ట్రానికి ఇన్-బౌండ్ టూరిస్టులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహించాలని సూచన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను పర్యాటక, సాంస్కృతిక కేంద్రమైన రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్ లో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, టూరిజం ఎండీ పట్టాన్ శెట్టి రవి సుభాష్ లతో మంత్రి దుర్గేష్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరంలో పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయాలన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్లు, టెంట్ సిటీలు, హోమ్ స్టేలు తదితర భక్తులకు మెరుగైన వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రానికి ఇన్-బౌండ్ టూరిస్టుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.అదే విధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. ఏడాదంతా నిరంతరం పర్యాటక శోభ ఉట్టిపడేలా వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు జరపాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా మంజూరైన నిధులు, వాటితో జరుగుతున్న పనుల ప్రగతిని మంత్రి దుర్గేష్ సమీక్షించారు. త్వరలోనే మరిన్ని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) కేంద్రానికి సమర్పించి, అదనపు నిధులు రాబట్టేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *