-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామాత్యుల కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 30 న మంగళగిరిలోని ‘గోపు గ్రాండ్’ వేదికగా జరగనున్న ‘సాహస్-2026’ (వీల్స్ ఆఫ్ కరేజ్) కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రి దుర్గేష్ కి ఆహ్వాన పత్రిక అందజేశారు. మస్క్యులర్ డిస్ట్రోఫీ (కండరాల క్షీణత) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల కోసం ఈ కార్యక్రమంలో 130 ఎలక్ట్రిక్ వీల్చైర్లను పంపిణీ చేయనున్నట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… స్వయంగా దివ్యాంగురాలైనప్పటికీ, తోటి మస్క్యులర్ డిస్ట్రోఫీ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శోభారాణి సుంకర చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కండరాల క్షీణత బారిన పడిన వారికి అండగా నిలవడం, వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. చిన్నతనంలోనే ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తే తగిన నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఇటువంటి మహత్తర లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సంస్థలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు చేయి చేయి కలిపి పనిచేస్తే భవిష్యత్తులో ఈ సవాల్‌ను సమర్థవంతంగా అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు.అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ద్వారా శోభారాణి చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్, తాను స్వయంగా పరిశీలించామని మంత్రి తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న ఈ బృహత్ ప్రయత్నాలు పూర్తి సత్ఫలితాలనివ్వాలని, మరిన్ని విజయాలను సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News