Breaking News

పంజాబ్‌ పర్యటనలో గోల్డెన్ టెంపుల్‌, జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ పాత్రికేయుల బృందం

-అటారి-వాఘా జేసీపీ బీటింగ్ రిట్రీట్ వేడుకలో పాల్గొన్న పాత్రికేయులు

అమృత్‌సర్, నేటి పత్రిక ప్రజావార్త :
“ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం కింద, ఆంధ్రప్రదేశ్ నుంచి జర్నలిస్టుల ప్రతినిధి బృందం పంజాబ్‌లో పర్యటించింది. పర్యటన చివరిలో, పాత్రికేయులు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌, జలియన్‌వాలా బాగ్, గోవింద్‌ఘర్ కోటను సందర్శించారు. అటారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ (జేసీపీ) వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుకలోనూ పాల్గొన్నారు. గోల్డెన్ టెంపుల్‌గా పేరొందిన హర్‌మందిర్‌ సాహిబ్‌ను ఏపీ జర్నలిస్టులు సందర్శించారు. అక్కడ, సిక్కు మతం స్ఫూర్తిని, సేవా ఉద్దేశ్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.

భారతదేశం-పాకిస్థాన్ సరిహద్దు అయిన అటారి-వాఘా జేసీపీ వద్ద జరిగిన బీటింగ్‌ రిట్రీట్‌లో ఉవ్వెత్తున ఎగసిపడిన దేశభక్తి భావాన్ని పాత్రికేయులు అనుభవించారు, ఆ బృందానికి ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం. దీనికి ముందు, బీఎస్‌ఎఫ్‌ మ్యూజియాన్ని సందర్శించారు. యుద్ధం & సాధారణ కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలు, దృశ్య-శ్రవణ క్లిప్పింగులు ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి. పాకిస్థాన్‌తో 553 కి.మీ. పొడవైన పంజాబ్ సరిహద్దును BSF రక్షిస్తోంది. అదేవిధంగా, ‘పార్టిషన్‌ మ్యూజియాని’కి కూడా పాత్రికేయులు వెళ్లారు. దేశ విభజన సమయంలో ప్రజలు అనుభవించిన భయాందోళనలకు సంబంధించిన చాలా అసలైన చారిత్రక ఆధారాలు, దృశ్య-శ్రవణ ప్రదర్శనలు ఇక్కడ ఉన్నాయి. జలియన్‌వాలా బాగ్‌లో, ఆనాటి బాధితుల్లో ఒకరి మునిమనవడు దీపక్ సేథ్ ఆ స్థలం చరిత్రను జర్నలిస్టులకు వివరించారు. ప్రతినిధి బృందంలో ది హిందు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హన్స్ ఇండియా, రహ్నుమా ఇ-డెక్కన్, విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వార్తాపత్రికలకు చెందిన ఎనిమిది మంది జర్నలిస్టులు ఉన్నారు.

పంజాబ్ పర్యటన తమకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని పాత్రికేయులు చెప్పారు. ఈ పర్యటనలో, వారు పంజాబ్ గొప్ప సంస్కృతి గురించి, చరిత్ర గురించి తెలుసుకున్నారు. ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలను గురించి కూడా తెలుసుకున్నారు. రమేష్ చంద్ర, అసిస్టెంట్ డైరెక్టర్ (సీబీసీ, విజయవాడ); డా. విక్రమ్ సింగ్, మీడియా అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, జలంధర్ కూడా బృందంలో ఉన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *