– పీఎం సూర్య ఘర్ కార్యక్రమం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి
– స్పెషల్ డ్రైవ్‌తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి
– లబ్ధి పొందేందుకు ఆన్‌లైన్లో తేలిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
– విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (సౌర విద్యుత్) పథకం అమలుతో జిల్లాలోని ప్రతి ఇల్లూ సూర్య ఘర్ కావాలని.. ఆర్థిక చేయూతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం-జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) సమావేశం జరిగింది. ఇందులో ఏపీ సీపీడీసీఎల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పాటు వివిధ ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 13న గౌరవ ప్రధాని ప్రారంభించిన పీఎం సూర్యఘర్ ద్వారా ఇంటి పైకప్పుపై రాయితీతో, అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకొని కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని.. అదే విధంగా వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు పునరుత్పాదక ఇంధన వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ప్రధానమని, ఈ నేపథ్యంలో పీఎం సూర్యఘర్ రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని సూచించారు. రూ. 2 లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్ ప్యానెల్‌ను రూ. 78 వేల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రాయితీ మినహా మిగిలిన రూ. 1,02,000ను తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. వినియోగ అవసరాన్నిబట్టి 1కేడబ్ల్యూ, 2కేడబ్ల్యూ ప్యానళ్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. తొలుత ఇతరుల్లో స్ఫూర్తినింపేలా స్వయం సహాయక సంఘాల మహిళలు; గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా తోడ్పాటునందించాలన్నారు. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సొంత ఇల్లు ఉండి, కరెంట్ కనెక్షన్ ఉన్నవారెవరైనా www.pmsuryaghar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల నేపథ్యంలో పీఎం సూర్యఘర్‌పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
అయిదు ఆదర్శ సౌర గ్రామాల గుర్తింపు:
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) సమావేశంలో జిల్లాలో బూదవాడ (జగ్గయ్యపేట), వెల్వడం (మైలవరం), పరిటాల (కంచికచర్ల), కంభంపాడు (ఎ.కొండూరు), షేర్ మహమ్మద్ పేట (జగ్గయ్యపేట) గ్రామాలను ఆదర్శ సౌర గ్రామాలుగా గుర్తించారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా అయిదు వేలకు పైబడి జనాభా ఉన్న గ్రామాలను గుర్తించి, ఆదర్శ సౌర గ్రామాల కాంపొనెంట్‌ను అమలుచేస్తున్నారు. ఈ గ్రామాల్లో పునరుత్పాదక ఇంధన వినియోగంలో పోటీతత్వాన్ని పెంచి, త్వరితగతిన 100 శాతం లక్ష్యాన్ని చేరుకున్న గ్రామాలకు రూ. కోటి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుంది.
సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.మురళీమోహన్, నోడల్ అధికారి ఎం.భాస్కర్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీపీవో పి.లావణ్య కుమారి, ఎన్ఆర్ఈడీసీఏపీ కోఆర్డినేటర్ మురళి, ఏపీసీపీడీసీఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.