-స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
-రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఎ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 13న జరిగే స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని.. అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఎ సూచించారు.
బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాబు ఎ.. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. పకడ్బందీ ఏర్పాట్లతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల పార్కింగ్, వీఐపీ వాహనాల పార్కింగ్, సెక్యూరిటీ చెక్‌పోస్టులు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు తదితరాల వద్ద భద్రత, వీఐపీ, పబ్లిక్‌తో పాటు వివిధ గ్యాలరీల వారీగా సీటింగ్, ఎగ్జిబిషన్, బ్యారికేడింగ్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు తదితరాలపై సూచనలు చేశారు. అదేవిధంగా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి అన్నదాతలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ఎంఎస్ఎంఈల ప్రతినిధులు తదితరులు కూడా హాజరుకానున్న నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, అదనపు కార్యదర్శి (ఫైనాన్స్) జె.నివాస్, శాప్ వీసీ అండ్ ఎండీ గిరీశ పీఎస్, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు.