Breaking News

ఈనెల 13న ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’

-మల్లాది విష్ణు చేతులమీదుగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలను అన్నివిధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెలలో పోరాటాలకు సిద్ధమైందని పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు బుధవారం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత మరోమాట చెప్పడం చంద్రబాబుకి కొత్తేమీ కాదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని ప్రచార సభలలో పదేపదే ఊదరగొట్టి.. తీరా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు. రైతన్నలకు రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ వంచించారని నిప్పులు చెరిగారు. కనుకనే అన్నదాతల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. ఈనెల 13న ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కార్యక్రమ ప్రధాన అజెండా అని.. ఇందులో భాగంగా అన్నదాతలతో కలిసి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు.

రూ. 20 వేల పెట్టుబడి సాయం ఏమైంది..?
గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ పనులకు ముందే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించిందని మల్లాది విష్ణు గుర్తుచేశారు. పైగా రూ.12,500 కి బదులు వెయ్యి రూపాయలు పెంచి రూ.13,500 ఇవ్వడం జరిగిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 వేల సాయం ఏమైందని సూటిగా ప్రశ్నించారు. బడ్జెట్లోనూ రూ. 10,700 కోట్ల కేటాయింపులు చేయవలసి ఉండగా.. ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదన్నారు. సంక్షేమ పథకాల ప్రస్తావన లేకుండానే బడ్జెట్ ను రూపొందించిన ఏకైక ప్రభుత్వం దేశంలో కూటమి ప్రభుత్వం ఒక్కటేనని ఎద్దేవా చేశారు. గతంలోనూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను చంద్రబాబు నిలువునా వంచించారని మల్లాది విష్ణు ఆరోపించారు. రైతులకు బేషరతుగా రుణాల మాఫీ అని చెప్పి చివరకు కోటయ్య కమిటీని ఏర్పాటుచేసి నీరుగార్చారన్నారు. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా రైతుల అప్పులపై పడే వడ్డీలకు కూడా సరిపోని విధంగా రూ.15 వేల కోట్లతో సరిపెట్టారని గుర్తుచేశారు. ఫలితంగా రైతులపై వడ్డీల భారం పెరిగి వాటిని తీర్చలేక వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు ద్రోహి చంద్రబాబు
వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే.. వైఎస్ జగన్ దానిని పండుగ చేసి చూపారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. విత్తనాలు నాటిన నాటి నుంచి ధాన్యం కొనుగోలు వరకు అనేక జాగ్రత్తలు తీసుకుని అన్నదాతలకు మేలు చేసిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ రైతు భ‌రోసా, ఉచిత పంట‌ల బీమా ప‌థ‌కం, రాయితీ విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకీకరణ పరికరాలు వంటి సంక్షేమ కార్యక్రమాలతో అన్నదాతలను తాము అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలున్నాయనే భరోసా అన్నదాతలలో ఉండేదని.. పంట కోతకొచ్చే సమయానికి మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేదని గుర్తుచేశారు. 2014–19 మధ్య గత టీడీపీ పాలనలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే.. 2019–24 మధ్య తమ హయాంలో 39 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అంతేకాకుండా గన్నీ సంచులు, లేబర్, రవాణా చార్జీలను ప్రభుత్వమే అదనంగా ఇస్తూ వచ్చిందన్నారు. కానీ గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోతూ ధాన్యం బకాయిలు పెట్టి వెళ్లిందని దుయ్యబట్టారు. అలాగే పంట నష్టానికి సంబంధించి 2014-19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పరిహారం చెల్లిస్తే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 54.55 ల‌క్షల మందికి రూ.7,802 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా వారి ఖాతాలకు జమ చేసినట్లు వెల్లడించారు. పైగా రైతుల తరపున ఐదేళ్లలో రూ.3,022 కోట్ల ప్రీమియం మొత్తాన్ని తమ ప్రభుత్వమే బీమా కంపెనీలకు చెల్లించిందని తెలియజేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సీజన్ కు సంబంధించి పంటల కొనుగోళ్లల్లోనే ఘోరంగా విఫలమైందని మల్లాది విష్ణు ఆరోపించారు. పైగా తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారని.. బస్తాకు రూ.300– రూ.400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే తుఫాన్లు, అకాల వర్షాలు, వరదల సమయంలో ముందస్తు ప్రణాళికలను రూపొందించడంలోనూ ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మల్లాది విష్ణు ఆరోపించారు. రైతాంగానికి చేసిన మోసానికిగాను కూటమి ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు విజయవాడ వంటి నగరాలలో రోడ్లకు టోల్ వసూలు చేసే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందని ధ్వజమెత్తారు. రైతుల ప‌ట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర‌సిస్తూ ఈ నెల 13న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైనట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రతిఒక్కరూ బీసెంట్ రోడ్డులోని పాత కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుంచి ప్రదర్శనగా మ్యూజియం రోడ్డు మీదుగా జిల్లా కలెక్టరేట్ కు వెళ్లడం జరుగుతుందన్నారు. రైతు పక్షపాత పార్టీగా ఆరుగాలం కష్టపడిన రైతన్నకు మేలు జరగాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి, నాయకులు అలంపూర్ విజయ్, దోనేపూడి శ్రీనివాస్, మేడా రమేష్, పి.నారాయణ, ప్రబల శ్రీనివాస్, పత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *