-కలెక్టర్ల సదస్సులో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ శాఖ పట్ల ప్రజల్లో సన్నగిల్లిన నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడానికి రెవెన్యూ సదస్సులు ఒక మంచి అవకాశమని, రెవెన్యూ, సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. రెవెన్యూ శాఖపై ఆయన కలెక్టర్ల సదససులో మాట్లాడారు. రెవెన్యూ శాఖకు వచ్చిన ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు పరిష్కరించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లకు విశేష అధికారాలున్నాయని, ఆ అధికారాలకు ఉన్న పవర్ ఏంటో చూపించాల్సిన తరుణం వచ్చిందన్నారు. హనుమంతుడి శక్తి ఏంటో హనుమంతుడికి తెలీదన్నట్లు చాలా మంది కలెక్టర్లకు తాము ఎంత శక్తిమంతులో తెలీదనే రీతిలో ఉన్నారని చమత్కరించారు. తల్లిదండ్రుల నుంచి భూములు రాయించుకుని వీధుల్లో వదిలేసిన బిడ్డలను విచారించి వారిని నెల రోజుల జైల్లో పెట్టగల అధికారం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేశారు. ఇలాంటి చట్టాలను అధికారులు సమర్థంగా వినియోగిస్తే వీధుల్లో అనాధలుగా తిరిగే తల్లిడండ్రులు కనిపించరని అన్నారు.
డిజిట్ లాక్ వేరొకరికి ఇవ్వొద్దు
జిల్లాల్లో ఎమ్మార్వోలు ఎవ్వరూ కూడా తమ డిజిటల్ లాకర్ ఇంకెవరికీ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్వోలు తమ డిజిటల్ కీ ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చి వారిపైన ఆధారపడి పనిచేయించిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. అలా ఎవరైనా చేస్తే వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్లు పరిశీలన జరపాలన్నారు. అన్ని ఎమ్మార్వో, ఆర్డీఓ కార్యాలయాల వద్ద సర్వేలియన్స్ కెమెరాలు పెట్టామన్నారు. జిల్లా కలెక్టర్లు ఫేస్ ఆఫ్ ది గవర్నమెంటు లాంటి వారని కలెక్టర్లు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మీ అధికారాలన్నీ ఉపయోగించి మళ్లీ రెవెన్యూ శాఖ ప్రతిష్ఠకు ప్రాణం పోయాలని కలెక్టర్లను కోరారు.