– విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో పకడ్బందీ ఏర్పాట్లు
– ఐఏఎస్ అధికారుల సారథ్యంలో ప్రత్యేక బృందాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనంద (వెల్తీ, హెల్తీ, హ్యాపీ) శోభిత ఆంధ్రప్రదేశ్ సాకారం లక్ష్యంగా స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 13వ తేదీ శుక్రవారం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో వైభవంగా జరగనుంది. ఇందుకు ఐఏఎస్ అధికారుల సారథ్యంలో ప్రత్యేక బృందాలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. 26 జిల్లాల నుంచి అతిథులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. విద్య, మహిళా సాధికారత, టెక్నాలజీ, ఆరోగ్యం, వ్యవసాయం, స్వచ్ఛంద సేవ.. ఇలా వివిధ విభాగాల్లో విశేష సేవలందిస్తున్న వారూ ప్రత్యేక ఆహ్వానితులుగా కార్యక్రమంలో పాల్గొంటారు. 500 బస్సుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రానున్నారు. దాదాపు 30 వేల మంది కార్యక్రమానికి హాజరవుతారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల అధికారులతో సమన్వయానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 500 బస్సులతో పాటు కార్లకు అవసరమైన 24 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. బస్సుల కోసం ప్రత్యేకంగా ఏడు పార్కింగ్ ప్లేస్‌లను సిద్ధం చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా వివిధ రకాల పాస్‌లను జారీచేయడం జరుగుతోంది. వీవీఐపీ, వీఐపీ, పబ్లిక్ తదితర గ్యాలరీకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. ప్రతి గ్యాలరీకి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు బృందాలు ఏర్పాటు చేశారు. పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్, ఎల్ఈడీ భారీ తెరలను ఏర్పాటు చేశారు. విజన్ డాక్యుమెంట్‌ను ప్రతిబింబించేలా 10 ఇతివృత్తాలతో ప్రదర్శనలు కార్యక్రమంలో భాగం కానున్నాయి. విజన్ డాక్యుమెంట్ ప్రజంటేషన్, స్టాళ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, అల్పాహారం, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లను గురువారం మునిసిపల్ మైదానంలో రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఎ, ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, సెర్ప్ సీఈవో జి.వీరపాండ్యన్, అదనపు కార్యదర్శి (ఫైనాన్స్) జె.నివాస్, శాప్ వీసీ అండ్ ఎండీ గిరీశ పీఎస్, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తదితర రాష్ట్రస్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు చర్చించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరక్కుండా కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.