-ఐఐఎస్‌ఈఆర్ తిరుపతి క్యాంపస్‌లో మొదటి “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్” సదస్సు: ఆవిష్కరణలు & విజ్ఞాన సహకారానికి స్ఫూర్తినిచ్చే వేదిక
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్” (ఐఐఎస్‌ఈఆర్)కు చెందిన జీవశాస్త్ర విభాగం, దేశంలోనే మొదటిసారిగా, “నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఇన్ బయోసైన్స్” (ఎన్‌సీయూఆర్‌బీ) నిర్వహిస్తోంది. తద్వారా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వాటిని శాస్త్రీయ సమాజంతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది.
ఐఐఎస్‌ఈఆర్ తిరుపతి క్యాంపస్‌లో డిసెంబర్ 16న ప్రారంభమైన ఈ సదస్సు 17న ముగుస్తుంది. ఈ రెండు రోజుల సదస్సును జీవశాస్త్ర విభాగానికి చెందిన అండర్ గ్రాడ్యుయేట్‌లు, అధ్యాపకులు నిర్వహిస్తున్నారు. జీవశాస్త్రం & అనుబంధ విభాగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం యువతను ప్రేరేపించడానికి ఎన్‌సీయూఆర్‌బీ ఒక వేదికగా మారుతుంది. ఈ సదస్సులో మౌఖిక ప్రదర్శనలు, పోస్టర్ సెషన్‌లు ఉంటాయి. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులు తమ వినూత్న పరిశోధన ఫలితాలను చర్చలు, పోస్టర్ ప్రెజెంటేషన్ల రూపంలో ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇవి కాకుండా, దేశంలోని ప్రసిద్ధ పరిశోధకుల ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. జీవశాస్త్రంలో నూతన పురోగతులు, కెరీర్ అవకాశాలను వారు వివరిస్తారు. ముఖాముఖి చర్చలకు వేదికను అందించడానికి, పరిశోధన నైపుణ్యాలను పెంచుకోవడానికి, శాస్త్ర & ఆవిష్కరణల భవిష్యత్తుపై మథనం జరిపేలా ప్యానెల్ చర్చలను రూపొందించారు.
ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన ఐఐఎస్‌ఈఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతను భట్టాచార్య, “ఈ సదస్సు భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధనలకు మైలురాయి వంటిది. ఎందుకంటే, ఇది యువ పరిశోధకులను & అనువజ్ఞులైన మార్గదర్శకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఇది పరస్పర సహకారాన్ని ప్రోత్సహిస్తుంది, విజ్ఞానాన్ని పంచుకునేలా చేస్తుంది, భవిష్యత్ తరం జీవశాస్త్రవేత్తలకు స్ఫూర్తినిస్తుంది. ఆరుగురు అతిథి వక్తల ఉపన్యాసాలు, 21 విద్యార్థుల బృందాల చర్చలు, దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి 315 మందికి పైగా పాల్గొనే ఈ సదస్సు, జీవశాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధన సమావేశాలకు ఒక కొలమానంగా ఉద్భవిస్తుంది” అని చెప్పారు. జీవశాస్త్ర విద్యార్థులు ఈ వేదికపై ప్రముఖ వక్తలతో నేరుగా మాట్లాడే అవకాశం పొందడంతోపాటు, జీవశాస్త్రంలో వారి పనితీరుకు గుర్తింపు పొందే ప్రత్యేక కార్యక్రమం ఈ సదస్సు నిలుస్తుంది.