-తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారు
-ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిదే
-సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయి
-పీపీఏల రద్దు, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణం అయ్యాడు
-జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది
-రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ రెడ్డి ఈఆర్సీని కోరారు
-నేడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు
-జగన్ హయాంలోనే వసూళ్లకు అనుమతి కోరిన డిస్కంలు
-వాయిదా వేస్తూ… కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలు
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుగ్లక్ చర్యల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో మైలురాయిని దాటారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ కు అయినా జగన్ రెడ్డి కోలుకుంటారు అనుకుంటే.. ఇంకా అదే పంథాలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. 2019 లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోనాటికి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్ మోహన్ రెడ్డికి అప్పగిస్తే… ఐదేళ్లలో అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని విమర్శించారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన వారికి దోచిపెట్టేందుకు జగన్ రెడ్డి విద్యుత్ లోటును సృష్టించినట్లు చెప్పారు. పీఏలను రద్దు చేయడంతో పాటు సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి… 10 వేల మెగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ను రాష్ట్రం కోల్పోయేలా చేశారని స్పష్టం చేశారు.
విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్కో ను జగన్ మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ప్రజల విద్యుత్ అవసరాలు అనే పేరు చెప్పి విచ్చల విడిగా విజయసాయి రెడ్డి అండ్ కో నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ రంగ నాశనానికి పునాది వేశారన్నారు. యూనిట్ ధర రూ. 5కు అందుబాటులో ఉన్నా కానీ కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో యూనిట్ ను రూ. 8 నుంచి రూ. 14 వరకు జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ కొనుగోలు చేసిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపుకు కేవలం జగన్ రెడ్డి అవినీతి, కక్ష సాధింపు, స్వార్థ రాజకీయాలే కారణమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి చేసిన పాపాలే ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో ప్రజలపై భారంగా మారాయని తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా విద్యుత్ కొనుగోళ్లు జరిపి ఆ భారాన్ని ప్రజలపై వేయాలని అధికారంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డి ఈఆర్సీని కోరారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుర్తు చేశారు. YCP అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా 2021-2022 కి APERC ఆమోదించిన True- Up Charges రూ. 3,082 కోట్లను జగన్ రెడ్డి హయాంలోనే వేసి ప్రజల రక్తం తాగారని విమర్శించారు. తరువాత 2022-2023 కి APERC ఆమోదించిన True- Up Charges రూ. 6,073 కోట్లను, 2023-2024 కి APERC ఆమోదించిన True- Up Charges రూ. 9,412 కోట్లను జగన్ రెడ్డి హయాంలోనే ప్రజలపై విధించాల్సి ఉండగా… ఎన్నికల ముందు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వాయిదాల పర్వంతో కమిషన్ రద్దు అయ్యే వారం ముందు ఆమోదం తెలిపినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుర్తు చేశారు. జగన్ రెడ్డి గద్దె దిగినా గానీ ఆయన చేసిన పాపాల కారణంగా ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు పై ఆ పార్టీ నాయకులు ధర్నాలు చేయాలని జగన్ పిలుపునివ్వడం తుగ్లక్ చర్య కాదా అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రశ్నించారు.