-స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం..
-నాబార్డ్ సీజియం ఎంఆర్ గోపాల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామీణహస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలనే లక్ష్యంతో ప్రైవేట్ షాపింగ్ మాల్స్ నందు స్టాల్ ఇన్ మాల్స్ నిర్వహిస్తున్నామని నాబార్డ్ సీజియం ఎంఆర్ గోపాల్ తెలిపారు.
నాబార్డ్ ఆర్థిక సహాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పివిపి మాల్ నందు ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను బుధవారం నాబార్డ్ సీజియం ఎంఆర్ గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా నాబార్డ్ సీజియం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామీణహస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలానే లక్ష్యంతో స్టాల్ ఇన్ మాల్స్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా గత ఏడాది నిర్వహించిన చేనేత వస్త్రాలు, జ్యూట్ బ్యాగులు, కలంకారి వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, ముత్యాల దండల ప్రదర్శన అమ్మకాలు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోవడంతో మంచి సత్ఫలితాలనిచ్చాయన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనలో కర్నూల్ కు చెందిన మిరాకిల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ వస్త్రాలు కేదారేశ్వర పేటకు చెందిన వేళాంగిణి మహిళ పొదుపు సంఘం ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ జ్యువలరీ వస్తువులు కొండపల్లి కనకదుర్గ డ్వాక్రా గ్రూప్ ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మలు, వేంకటగిరికి చెందిన మూన్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో వేంకటగిరి పట్టు చీరలు, నేత వస్త్రాలు వంటివి ప్రదర్శలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వయం సహాయక బృందాల మహిళలకు నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ అందించేందుకు నాబార్డ్ సంస్థ సిద్ధంగా ఉందని 30 మందికి పైబడి బృందంగా ఏర్పడి ముందుకు వస్తే వారి ఎంచుకున్న రంగంపై శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పివిపి మాల్ ల్లో ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను తిలకించి స్వయం సహాయక బృందాల మహిళలకు ఆర్ధిక పురోగతిని కల్పించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నాబార్డ్ సీజియం ఎంఆర్. గోపాల్ కోరారు.
నేస్తం సంస్థ సీఈవో వి. సురేష్ మాట్లాడుతూ నాబార్డ్ సహకారంతో గత ఏడాది విశాఖపట్నం, విజయవాడ పట్టణాలలో స్టాల్ ఇన్ మాల్స్ ప్రదర్శనను నిర్వహించడం జరిగిందన్నారు. ఒక్కో ప్రదర్శన 90 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఒక్కొక్క కళాకారుడు, చేతివృత్తిదారులకు 15 రోజులపాటు ప్రదర్శన అమ్మకాలు నిర్వహించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజలకు గ్రామీణహస్తకళారూపాలను తయారీ ధరలకే అందించాలనే లక్ష్యంతో పాటు కళాకారులకు మరింత ఆర్ధిక ప్రయోజనం చేకూర్చేలా స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శన కార్యక్రమంలో నాబార్డ్ ఎజియం మిలింద్ చౌసాల్కర్, నేస్తం సంస్థ డైరెక్టర్ కె. నందిని, ప్రతినిధులు ఎ. విక్రమ్, వై. గోపి, స్వయం సహాయక బృందాల మహిళలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.