-యువతరం భవిష్యత్ భారత నిర్మాణ నిర్దేశకులు
-భారతదేశం వసుధైవ కుటుంబ భావనతో ప్రపంచ క్షేమాన్ని కాంక్షించింది
-భారతీయ దేవాలయాలు జ్ఞాన కేంద్రాలుగా సాంస్కృతిక వారసత్వాన్ని పంచాయి
-స్వరాజ్య ఉద్యమంలో ఆలయాల పాత్ర మరువలేనిది
-మానసిక ఆరోగ్యం కోసం ఆధ్యాత్మికత మార్గం ఎంతో అవసరం
-ఆధ్యాత్మిక గురువులు ప్రజల్లోకి వెళ్ళి సాంస్కృతిక చైతన్యం తీసుకురావాలి
-యువతరం ఆలయాలను సందర్శించి మన చరిత్ర, సంస్కృతుల పట్ల అవగాహన పెంచుకోవాలి
-సామాజిక సేవను ప్రతి ఒక్కరూ తమ కనీస బాధ్యతగా భావించాలి
-“కాంబోడియా – హిందూ దేవాలయాల పుణ్యభూమి” మరియు “నేటి వియత్నాం – నాటి హైందవ సంస్కృతి” పుస్తకాలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా యువతను తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. యువతరం మీద తనకు ప్రగాఢ నమ్మకముందన్న ఆయన, భవిష్యత్ భారత నిర్మాణ నిర్దేశకులు యువతేననే విషయాన్ని నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యులు ఎన్.పి. వెంకటేశ్వర చౌదరి రచించిన “కాంబోడియా – హిందూ దేవాలయాల పుణ్యభూమి” మరియు “నేటి వియత్నాం – నాటి హైందవ సంస్కృతి” తెలుగు పుస్తకాలను సోమవారం న్యూఢిల్లీలోని తమ నివాసం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. సనాతన కాలం నుంచి భారతదేశం, వసుధైవ కుటుంబ భావనతో ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించిందన్న ఉపరాష్ట్రపతి, పరాయిదేశాల నుంచి అనేక దాడులు జరిగినా వేళ్ళూనుకున్న బారతీయ సంస్కృతి మనకు దూరం కాలేదని తెలిపారు. ఈ విషయంలో మన ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషించాయన్న ఆయన, వేదవ్యాసుడు మొదలుకుని, శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ గురునానక్, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానందుడు, శ్రీ నారాయణ గురు, సహా ఎందరో మహనీయులు మన సమాజాన్ని జాగృతం చేశారని, వారి చూపిన బాటలో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యవస్థలో పూర్వం నుంచి దేవాలయాలకు ఓ ప్రత్యేక స్థానం ఉందన్న ఉపరాష్ట్రపతి, ధార్మిక చైతన్యానికి, వికాసానికి, పరిరక్షణకు ఆలవాలమైన భారతీయ దేవాలయాలు జ్ఞాన కేంద్రాలుగా, కళలకు కాణిచిగా, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడంలో తమ ప్రత్యేకతను చాటుకున్నాయన్నారు. అనాదిగా ప్రజల సాంఘిక జీవనాన్ని దేవాలయాలు ప్రభావితం చేశాయన్న ఆయన, ధర్మపరిరక్షణ అనే ప్రధాన బాధ్యతను నిర్వహిస్తూనే సామాజిక సమరసతా భావాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశాయని తెలిపారు. సర్వవ్యాపి అయిన భగవంతుణ్ని మన సౌకర్యం కోసమే ఒక చోట ప్రతిష్టించి దేవాలయాల ద్వారా అర్చిస్తున్నామన్న ఉపరాష్ట్రపతి, మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం, పురాణాల సంగమంగా దేవాలయాలు వర్ధిల్లాయని తెలిపారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచే కేంద్రాలుగా, విద్యాలయాలుగా, వైద్యాలయాలుగా, అన్నదాన నిలయాలుగా, గ్రంథాలయాలుగా, యోగ నిలయాలుగా, న్యాయ కేంద్రాలుగా, కళా నిలయాలుగా అనేక పాత్రలను దేవాలయం పోషిస్తూ వచ్చిందన్న ఆయన, అనేక కళలు దేవాలయ వ్యవస్థను ఆలంబనగా చేసుకుని వికాసాన్ని పొందాయని, స్వరాజ్య ఉద్యమంలో కూడా దేవాలయాల పాత్ర మరచిపోలేనిదని తెలిపారు. వేగాన్ని సంతరించుకున్న మన జీవన విధానంలో భాగంగా ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించాల్సిన ఆవశ్యకత ఉందన్న ఉపరాష్ట్రపతి, కోవిడ్ నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు ప్రజల్లోకి వెళ్ళి సాంస్కృతిక తీసుకురావలసిన అవసరం ఉందన్న ఆయన, యువతరాన్ని ఉత్తేజితం చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కాంబోడియాలోని అంగ్ కోర్ వాట్ దేవాలయాన్ని కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, ఆ సమయంలో అనిర్వచనీయమైన అనుభూతిని పొందానని, ఆ దేవాలయంలోని శిల్పాలు మన గత వైభవాన్ని కళ్ళకు కడతాయని తెలిపారు. ఇలాంటి ఆలయాలను ప్రతి భారతీయుడు, ముఖ్యంగా యువతరం సందర్శించాల్సిన అవసరం ఉందన్న ఆయన, మన సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాల గురించి యువత అవగాహన పొందాలని సూచించారు. “కాంబోడియా – హిందూ దేవాలయాల పుణ్యభూమి” మరియు “నేటి వియత్నాం – నాటి హైందవ సంస్కృతి” పుస్తకాల్లో శ్రీ వెంకటేశ్వర చౌదరి గారు ఆ ఆలయాల గురించి కూలంకషంగా తెలియజేసే ప్రయత్నం చేశారన్న ఉపరాష్ట్రపతి, పుస్తకాల్లోని ఛాయా చిత్రాలు అక్కడి శిల్పకళను కళ్ళకు కట్టడమే గాక మన గత వైభవాన్ని తెలుసుకునేందుకు సాయపడతాయని తెలిపారు. వారు వివరణాత్మకంగా ప్రతి చిత్రాన్ని పుస్తకంలో అందించిన తీరు అభినందనీయమని తెలిపారు.
కంచి కామకోటి 69వ పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. నడిచే దేవుడిగా సుప్రసిద్ధులై సనాతన ధర్మ పరిరక్షణ కోసం జీవితాన్ని అంకింతం చేసిన శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారసునిగా శ్రీ జయేంద్ర సరస్వతి పీఠాధిపతి అయ్యారని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అన్న ఉన్నత భావాన్ని ఆచరణలో చూపించి, అనేక విద్యాలయాలు, వైద్యాలయాల నిర్వహణ ద్వారా కంచి మఠాన్ని సామాజిక సేవలో భాగస్వామ్యం చేశారన్నారు. వివక్షలకు అతీతంగా వారు చేసిన సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక మార్గానికి అసలైన అర్థం చెప్పాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ భన్వరీలాల్ పురోహిత్, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి, పుస్తక రచయిత శ్రీ ఎన్.పి. వెంకటేశ్వర చౌదరి తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.