-2021-22 సంవత్సరానికి గాను పంటలు, వాటి గిట్టుబాటు ధరలు…
-ఇకపై రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదన్న బెంగ లేదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతుధరల ప్రకటన పై అవగాహన కలిగించే గోడపత్రికను జిల్లాక లెక్టరు జె. నివాస్ ఆవిష్కరించారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధవారం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు డా. కె.మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్, నూజివీడు ఆర్ డివో కె. రాజ్యలక్ష్మి, గుడివాడ ఆర్డివో శ్రీనుకుమార్, మార్కెటింగ్ శాఖ డిప్యూటి డైరెక్టరు యం.దివాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ సీజన్ ప్రారంభానికి ముందే మద్ద తుధరలు ప్రకటిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమేరకు 2021-22 సంవత్సరానికి గాను వివిధ పంటలు, వాటి గిట్టుబాటు ధరలను తెలియజేసే మద్దతుధరల ప్రకటనను విడుదల చేయడం జరిగిందన్నారు. మద్ద తుధరలకు పంటలు అమ్ముకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఇ-క్రాఫ్ లో పంట వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టరు జె.నివాస్ చెప్పారు. అలా నమోదు చేసుకున్న తర్వాత రైతుభరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా గ్రామ ఉద్యాన సహాయకుల వద్ద సియం యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనీస గిట్టుబాటు ధర దక్కని పరిస్థితుల్లో వెంటనే పంట కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. 2021-22 సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రకటించిన వివిధ పంటలు, వాటి గిట్టుబాటు ధరలను ఆయన వివరించారు. ఆయా రబీ, ఖరీఫ్ పంట కాలాల్లో నిర్దేశించిన మాసాల్లో పసుపు క్వింటాలుకు రూ. 6850/-, మిర్చి రూ. 7 వేలు, ఉల్లి రూ. 770/-, చిరుధాన్యాలు రూ. 2500/-, ధాన్యం కామన్ రూ. 1940/-, ధాన్యం గ్రేడు-ఏ రూ. 1960/-, జొన్నలు (మాలదండి) రూ. 2758/-, జొన్నలు (హైబ్రీడ్) ప్రజలు వినియోగించే రకం రూ. 2738/-, జొన్నలు పరిశ్రమ, దాణాకొరకు వాడేరకం రూ. 1850/-, సజ్జలు రూ. 2250/-, రాగులు రూ. 3377/-, మొక్కజొన్నలు రూ. 1870/-, కందులు రూ. 6300/-, పెసలు రూ. 7275/-, మినుములు రూ. 6300/-, వేరుశనగ రూ. 5550/-, కొబ్బరి (మర) రూ. 10335/-, కొబ్బరి (బాలు) రూ. 10600/-, కాటన్ (ప్రత్తి) పొట్టి పింజ రూ. 5726/-, కాటన్ (ప్రత్తి) పొడవు పింజ రూ. 6025/-, బత్తాయి/చీనీకాయలు (మౌసంబి) రూ. 1400/-, అరటి రూ. 800/-, సోయాబీన్ రూ. 3950/-, పొద్దుతిరుగుడు రూ. 6015/-గా గిట్టుబాటు ధరలు పేర్కొనడం జరిగింది.