Breaking News

పార్టీలకతీతంగా సంక్షేమ పాలన… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పార్టీలకతీతంగా సంక్షేమ పాలనను అందిస్తోన్న ప్రభుత్వం దేశంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కటేనని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 26 వ డివిజన్ లోని అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద నుంచి రైవస్ కాల్వ గట్టు మీదుగా మాచవరం డౌన్ వరకు డివిజన్ వైఎస్సార్ సీపీ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ గారితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీధులలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై ఎమ్మెల్యే గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం రైవస్ కాలువ పొంగడంతో నీళ్లు చేరిన ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. తక్షణమే అక్కడి కుటుంబాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. మరోవైపు డివిజన్ లో గడిచిన రెండేళ్లలో రూ. 2 కోట్ల విలువైన పనులు చేపట్టగా.. కోటి రూపాయల పనులను పూర్తి చేసినట్లు వెల్లడించారు. మరో రూ. కోటి పనులు వివిధ దశలలో ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా డివిజన్ లో 652 మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక, 736 మందికి అమ్మఒడి, 600 మందికి ఇళ్ల పట్టాలు, 170 మందికి చేయూత, 85 మందికి కాపునేస్తం, 156 మందికి జగనన్న తోడు, 64 మంది చేదోడు, 51 మందికి వాహనమిత్ర, 193 మందికి విద్యాదీవెన పథకాల రూపంలో లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు.

దిశ యాప్ బ్రోచర్ ఆవిష్కరణ…
రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు ఎక్కడకైనా తాము సురక్షితంగా వెళ్లగలమనే ధైర్యాన్ని దిశ యాప్ వారిలో నింపిందని మల్లాది విష్ణు అన్నారు. తెలంగాణలో చోటు చేసుకున్న దిశ ఘటనతో చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి ఘటన మన రాష్ట్రంలో జరగకూడదని, మహిళలకు పూర్తి భద్రత కల్పించాలనే ఆలోచనతో దిశ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారన్నారు. వీటితో పాటుగా మహిళలకు మరింత భద్రత కల్పించాలనే తపనతో ‘దిశ యాప్‌’ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్‌ను ప్రతిఒక్క మహిళ డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని గ్రామ సచివాలయ సిబ్బంది, మహిళా పోలీస్, వాలంటీర్లకు సూచించారు. అనంతరం దిశ యాప్ బ్రోచర్ ను ఆవిష్కరించారు.

పులిచింతల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే…
పులిచింతల 16వ నెంబర్ గేట్ పై టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ చంద్రబాబు బినామీ కాదా? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తే పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడానికి ప్రధాన కారణమని ఆరోపించారు. ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని 2015లోనే భద్రతా కమిటీ నివేదిక ఇచ్చినా బాబు సర్కారు బేఖాతరు చేసిందన్నారు. పులిచింతల ప్రాజెక్టు గేట్ల సంఖ్యను తగ్గించాలని నాడు దేవినేని ఉమా చేసిన నీచ రాజకీయాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఐదేళ్లు పాలన చేశామన్న సంగతి కూడా మర్చిపోయి.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై నిస్సిగ్గుగా టీడీపీ చేస్తున్న విమర్శలను చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని మల్లాది విష్ణు అన్నారు. కనుకనే రాష్ట్రంలో టీడీపీని ప్రజలు పూర్తిగా భూస్థాపితం చేశారని.. బీజేపీకి అసలు కేడర్ లేకుండా పోయిందని విమర్శించారు. రాజకీయ ఉనికిని నిలుపుకునేందుకు ఈ రెండు పార్టీలు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు టిప్పు సుల్తాన్ విగ్రహంపై కూడా బీజేపీ నాయకులు వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో యడ్యూరప్ప టిప్పు సుల్తాన్ వేషధారణను అనుకరిస్తారు.. ఢిల్లీలో టిప్పు సుల్తాన్ శకటాన్ని ప్రదర్శిస్తున్నారు.. ఆయన పేరిట స్టాంపులు కూడా విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఇరుపార్టీల ద్వంద్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఔట్ డేటెడ్ పార్టీగా మిగిలిపోగా.. బీజేపీ బేస్ లెస్ పార్టీగా తయారైందన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు డివిజన్ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ నాగ ఆంజనేయులు, పారా ప్రసాద్, బి.అప్పారావు, అన్సారీ బేగ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *