మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు కల్పించిన చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకొని అందరూ విద్యాధికులై ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి ఆదివాసీలు అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డా.బీ.ఆర్.అంబేద్కర్, ఏకలవ్యుడు, రుక్మాoగదయ్య చెంచులక్ష్మి , అల్లూరి సీతారామరాజు, సేవాలాల్ తదితరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముందుగా మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్, గిరిజన నాయకుల సమక్షంలో జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. నూజివీడుకు చెందిన దుర్గాప్రసాద్ బృందం లంబాడీల నృత్యం చేశారు, అనంతరం మచిలీపట్నం ముస్తాఖాన్ పేటకు చెందిన యానదుల నృత్యం, మరియమ్మ బృందం ఎరుకుల సోది తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నూజివీడు ట్రిపుల్ ఐ ఐ టి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జ్యోతిలాల్ నాయక్ ఆదివాసి దినోత్సవ ఆవిర్భావం సంక్షిప్త వివరణ ప్రసంగం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఆదివాసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను పూర్తి స్థాయిలో వారికే అందేలా.. అధికారులు కృషి చేయాలన్నారు. గిరిజనులు తమ హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణలో ఆదివాసీల పాత్ర, కృషి ఫలితం ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు.
అణగారిన అన్ని వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ రాజ్యరంగాన్ని రచించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఎస్సి, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక చట్టాలు, హక్కులను తీసుకువచ్చి వారి అభివృద్ధికి ప్రభుత్వం దోహదపడుతోందన్నారు. జిల్లా జనాభాలో దాదాపు 4% పైగా గిరిజనులు ఉన్నారన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి ఎరుకుల, లంబాడీ, యానాది వర్గాల వారి అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు. గిరిజనుల కు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ ద్వారా పర్యవేక్షణ, సహకారం, బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వారికే అందేలా , అభివృద్ధి కోసమే ఖర్చు చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ, నా ప్రియతమ లంబాడి, ఎరుకుల, యానాది ఇతర గిరిజన సోదరులందరికి తన హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను అంటూ ప్రసంగం మారుమోగిన చప్పట్ల మద్య ప్రారంభించారు. కొండ ప్రాంతంలో నివసించే గిరిజనులకు లభ్యమయ్యే భూభద్రత, ప్రత్యేక అవకాశాలు, ఏజెన్సీ చట్టాలు లంబాడి, ఎరుకుల,యానాది తదితర ఆదివాసీలకు లభించక పోవడంతో వీరు సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిపోవడం ఎంతో బాధాకరమన్నారు. వీరు ఎక్కువగా వ్యవసాయ సంబంధిత వృత్తులపై ఆధారపడి దుర్భరంగా జీవించే ప్రజలని అన్నారు. ఏ వసతులు పొందని ఈ ప్రజల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యా ద్వారా ఆదివాసీల భవిష్యత్తుకు నాందీ అవుతుందన్నారు. గిరిజనుల హక్కులను పరిరక్షించుకునే హక్కు మన చేతుల్లోనే ఉందన్నారు. ఏ ఒక్క గిరిజనుడికి కూడా అన్యాయం జరగకుండా ఐక్యంగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు కూడా గిరిజన కాలనీలు, వారి భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వారి వనరుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జె. నివాస్ సూచించారు.
అనంతరం మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ పలువురు లబ్ధిదారులకు మెగా చెక్కుల పంపిణీ, స్ప్రేయర్లు,పవర్ టిల్లర్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసరా, సంక్షేమం జాయింట్ కలెక్టర్ కె. మోహనకుమార్, మచిలీపట్నం రెవిన్యూ డివిజన్ అధికారి ఎన్. ఎస్.కె. ఖాజావలి, జిల్లా పరిషత్ సి ఇ ఓ సూర్యప్రకాశరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రుక్మాoగదయ్య, ఎస్సి కార్పొరేషన్ ఈ డి వి. మురళి, మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు, 22 వ డివిజన్ కార్పొరేటర్ ఏకసిరి వెంకటేశ్వరరావు, 6 వ డివిజన్ కార్పొరేటర్ పర్ణం సతీష్, గిరిజన నాయకులు ఫకీరయ్య, కోటేశ్వరరావు, రమాదేవి , దేవరకొండ రమణీ తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …