Breaking News

ఒలంపిక్స్ విజేతల స్పూర్తితో సత్తా చాటాలి…

-రాష్ట్ర క్రీడాకారులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు
-రాజ్ భవన్ వేదికగా సింధు, రజనీ, సాత్విక్ లకు ఘనంగా సన్మానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టోక్యో ఒలంపిక్స్ విజేతలను స్పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పిలుపు నిచ్చారు. రాష్ట్రం నుండి ముగ్గురు యువ ఒలంపియన్లు ఉండటం ఎంతో సంతోషదాయకమన్నారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టోక్యో ఒలంపిక్ పతక విజేతలు, క్రీడాకారులను గవర్నర్ సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈ విజయాలతో క్రీడాకారుల కుటుంబ సభ్యులే కాకుండా , దేశం యావత్తు గర్వపడుతుందన్నారు. జాతికి ప్రాతినిధ్యం వహించటంతో పాటు ఒలింపిక్ క్రీడలలో పాల్గొనడం అనేది ప్రతి క్రీడాకారుడు పెంపొందించుకున్న కల కాగా, అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులు మాత్రమే ఆ కలను సాకారం చేసుకోగలుగుతారన్నారు. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ లో కాంస్య పతకం గెలుచుకున్న సింధు వరుసగా రెండు ఒలింపిక్ గేమ్స్ లో పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచారన్నారు. సింధు తల్లిదండ్రులు ఇద్దరూ క్రీడాకారులు కావడం కూడా ఈ విజయాలకు కారణం అవుతాయని, 2013 నుండి 14 సంవత్సరాల వయస్సులోనే తన క్రీడా వృత్తిని ప్రారంభించి 2015 లో మినహా ప్రతి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించారని గవర్నర్ కొనియాడారు. మరోవైపు ఓ కుగ్రామం నుండి వచ్చిన రజనీ భారతీయ మహిళా ఒలింపిక్ హాకీ టీమ్‌లో మంచి ఆటతీరును ప్రదర్శించారన్నారు. కుటుంబ సభ్యుల సంకల్పం, నిరంతర మద్దతు ద్వారా రజనీ ఈ స్దానానికి చేరుకోగలిగారన్నారు. రియో, టోక్యో ఒలింపిక్ గేమ్స్ రెండింటిలోనూ భారత మహిళా హాకీ జట్టుకు ఎంపిక కావడం ఆమె ప్రతిభ, కృషికి ప్రతిబింబమని గవర్నర్ పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడలలో భారత మహిళల హాకీ జట్టు పతకం సాధించక పోయినా, వారు అత్యుత్తమ ప్రదర్శనతో ప్రతి భారతీయుడి హృదయాలను గెలుచుకున్నారన్నారు. సాత్విక్ సాయిరాజ్ రింకిరెడ్డి తన కెరీర్ ప్రారంభంలోనే పేరు, ఖ్యాతిని సాధించాడని గవర్నర్ అభినందించారు. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో తన భాగస్వాములతో కలిసి సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి 2015 నుండి 2019 వరకు 10 అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకోవడం అతని ప్రతిభకు నిదర్శనమని, సాత్విక్‌కు మంచి భవిష్యత్తు ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. భారత దేశం కోసం ఎన్నో పురస్కారాలను అందించి దేశ పతాకాన్ని ప్రపంచ పటాన ఎగురవేయ్యాలని గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ అకాంక్షించారు. పర్యాటక, భాషా సాంస్కృతిక , క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ క్రీడాకారుల ఉన్నతికి అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, క్రీడా ప్రాధికార సంస్ధ నిర్వహణా సంచాలకులు ఎన్ . ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సన్మానం సందర్భంగా క్రీడాకారులు సింధు, రజనీ, సాత్విక్ మాట్లాడుతూ దేశ ప్రతిష్టతను ఇనుమడింప చేసేందుకు మరింత పట్టుదలతో కృషి చేస్తామన్నారు. తమలో క్రీడా స్పూర్తిని రగిలింపచేసేలా గవర్నర్ నుండి అభినందనలు అందుకోవటం ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *