Breaking News

గాంధీ కొండ చారిత్ర‌క ఔన్న‌త్యానికి కొత్త శోభ‌

– 50 రోజుల్లోనే ఆధునికీక‌ర‌ణ ప‌నుల‌తో అభివృద్ధి
– స‌మ‌ష్టి కృషితో హిల్ అభివృద్ధిలో భాగ‌స్వాముల‌మ‌వుతాం
– స్వాతంత్ర్య స‌మ‌రంలో విజ‌య‌వాడ పాత్ర‌కు గాంధీకొండ గొప్ప ద‌ర్ప‌ణం
– వ‌న‌రుల స‌ద్వినియోగంతో గాంధీ కొండ‌ను ద‌శ‌ల వారీగా అభివృద్ధి చేస్తాం
– గాంధీ కొండ గొప్ప విజ్ఞాన వికాస కేంద్రం
– ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌తో భావిత‌రాల‌కు న‌గ‌ర వైభవాన్ని చాటిచెప్పాం
– విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), గాంధీ హిల్ ఫౌండేషన్ ఛైర్మ‌న్‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు డా. గాంధీ పీసీ కాజా, ఎమ్మెల్యేలు మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌, య‌ల‌మంచిలి సుజ‌నా చౌద‌రి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స‌మ‌ష్టి కృషితో గాంధీ కొండ చారిత్ర‌క ఔన్న‌త్యానికి పున‌ర్వైభ‌వం వ‌చ్చింద‌ని, 50 రోజుల్లోనే ఆధునికీక‌ర‌ణ ప‌నుల‌తో కొండ కొత్త శోభను సంత‌రించుకుంద‌ని.. అందుబాటులో ఉన్న వ‌న‌రులను స‌ద్వినియోగం చేసుకుంటూ, స‌మ‌ష్టి కృషితో ద‌శ‌ల వారీగా జ‌రిగే కొండ అభివృద్దిలో భాగ‌స్వాముల‌మ‌వుతామ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), గాంధీ హిల్ ఫౌండేషన్ ఛైర్మ‌న్‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు డా. గాంధీ పీసీ కాజా, ఎమ్మెల్యేలు మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌, య‌ల‌మంచిలి సుజ‌నా చౌద‌రి త‌దిత‌రులు అన్నారు.
156వ గాంధీ జ‌యంతి వేడుక‌లు గురువారం న‌గ‌రంలోని గాంధీ హిల్‌పై జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో గౌర‌వ ప్ర‌జాప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌తో పాటు గాంధీ హిల్ ఫౌండేష‌న్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొని మ‌హాత్మునికి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ విజ‌య‌వాడ ఎంత సుంద‌ర న‌గ‌ర‌మో గాంధీహిల్ పైనుంచి చూస్తే తెలుస్తుంద‌ని.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే చారిత్ర‌క ప్రాంత అభివృద్ధికి కృషిచేసిన ఫౌండేష‌న్ స‌భ్యుల‌కు అభినంద‌న‌లు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు. వైబ్రెంట్ విజ‌య‌వాడ నినాదంతో న‌గ‌ర అభివృద్ధికి కృషిచేస్తున్నామ‌ని, న‌గ‌ర వైభ‌వాన్ని భావిత‌రాల‌కు తెలియ‌జేసేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఫొటో ప్ర‌ద‌ర్శ‌న వంటివి ఏర్పాటు చేసిన‌ట్లు ఎంపీ శివ‌నాథ్ తెలిపారు.

గాంధీ హిల్ ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ డా. గాంధీ పీసీ కాజా మాట్లాడుతూ.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే లిఫ్ట్‌, ర్యాంప్‌, హ‌రిత విస్తీర్ణం పెంపు, సుంద‌రీక‌ర‌ణ, వ్యూ పాయింట్, టాయ్ ట్రెయిన్ – ట్రాక్ మ‌ర‌మ్మ‌తులు త‌దిత‌ర అభివృద్ధి ప‌నుల‌ను పూర్తిచేశామ‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు రూప‌మైన స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ 2047.. మ‌హాత్ముని బోధ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌గ‌తి దిశ‌గా వేసే గొప్ప ముంద‌డుగు అని, మ‌స‌క‌బారిన అద్దాన్ని తుడిచిన‌ట్లుగా గాంధీ ప‌ర్వ‌తాన్ని పూర్వ కాంతిక‌న్నా మెరుగైన స్థితికి చేర్చిన ఈ శుభ సంద‌ర్భంలో స్వ‌చ్ఛాంధ్ర‌, స్వ‌ర్ణాంధ్ర నినాదాల‌తో పాటు స‌త్యాంధ్ర – సంప‌న్నాంధ్ర నినాదాల‌ను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రముంద‌న్నారు. మ‌హాత్ముని ఆశ‌యాల స్ఫూర్తితో గాంధీ కొండ గాంధీ గ్లోబ‌ల్ సెంట‌ర్‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని.. దీన్ని సాకారం చేసేందుకు ఫౌండేష‌న్ చేసే నిర్మాణాత్మ‌క కృషిలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.

అవ‌నిగ‌డ్డ శాస‌న‌స‌భ్యులు మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. త‌న చిన్న‌నాటి నుంచి గాంధీ కొండతో ప‌రిచ‌యం ఉంద‌ని, ఈ కొండ వెనుక విజ‌య‌వాడ చారిత్ర‌క ఔన్న‌త్యం ఉంద‌ని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటం ప‌రంగా విజ‌య‌వాడ పాత్ర‌కు గాంధీ కొండ గొప్ప ద‌ర్ప‌ణ‌మ‌ని పేర్కొన్నారు. దేశంలోని ప్ర‌ముఖ స్మార‌క స్థ‌లాల్లో గాంధీ కొండ ఒక‌టని.. ఈ ప్రాంత పున‌ర్వైభ‌వానికి కృషిచేస్తున్న ప్ర‌తిఒక్క‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌తో సంబంధ‌మున్న స్వాతంత్ర్య స‌మ‌రంలోని వివిధ ఘ‌ట్టాలు, జాతీయ ప‌తాక రూప‌క‌ల్ప‌న‌తో ముడిప‌డిన అంశాల‌ను శాస‌న‌స‌భ్యులు వివ‌రించారు.

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి గొప్ప కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డం, అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్య‌మంలో ఎంద‌రో మ‌హ‌నీయులు గొప్ప కృషిచేశార‌ని.. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన జాతిపిత మ‌హాత్మా గాంధీ ప్ర‌త్యేక గుర్తింపు సాధించార‌ని పేర్కొన్నారు. యువ‌త‌లో దేశ‌భ‌క్తిని పెంపొందించేందుకు, స‌న్మార్గంలో న‌డిపించేందుకు గాంధీ కొండ నాంది కావాల‌న్నారు. ఇదో విజ్ఞాన కేంద్రంగా భాసిల్లాల‌ని కోరుకుంటున్నట్లు శాస‌న‌స‌భ్యులు సుజనా చౌద‌రి పేర్కొన్నారు.

జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ.. గాంధీ కొండ గొప్ప విజ్ఞాన కేంద్ర‌మ‌ని, మ‌హాత్ముని ఆశ‌యాల స్ఫూర్తిగా ముంద‌డుగు వేసేందుకు ఇదో గొప్ప వేదిక‌ని అన్నారు. గాంధీ కొండ ప్రాంతాన్ని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్ద‌డంలో భాగంగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టి పూర్తిచేశామ‌న్నారు. యువ‌త‌రానికి మ‌న ఘ‌న చారిత్ర‌క వార‌స‌త్వ సంప‌ద‌ను అందించేందుకు ఇలాంటి గొప్ప ప్రాంతాలు దోహ‌దం చేస్తాయ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళులు అర్పించారు. డా. రావి శార‌ద రాసిన తెలుగు నేల‌పై గాంధీజీ అడుగుజాడ‌లు, డా. జి.వి.పూర్ణ‌చందు రాసిన ఆంధ్ర‌గాంధీయం పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించారు. గాంధీ కొండ అభివృద్ధిలో భాగ‌స్వాములైన ప్ర‌తిఒక్క‌రినీ ఫౌండేష‌న్ ఛైర్మ‌న్‌, స‌భ్యులు స‌త్క‌రించారు.
కార్య‌క్ర‌మంలో గాంధీ హిల్ ఫౌండేష‌న్ కార్య‌ద‌ర్శి వై.రామ‌చంద్రరావు, గాంధీ హిల్ ఫౌండేష‌న్ మాజీ ఛైర్మ‌న్ గోక‌రాజు గంగ‌రాజు, ఏపీ గాంధీ స్మార‌క నిధి వైస్ ఛైర్మ‌న్ డా. చ‌క్ర‌పాణి, గాంధీ హిల్ ఫౌండేష‌న్ వైస్ ఛైర్మ‌న్ డా. జంధ్యాల శంక‌ర్, ఫౌండేష‌న్ స‌ల‌హాదారులు కేవీఎల్ హ‌రినాథ్‌, ప్రొఫెస‌ర్ బి.పాండురంగారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *