-వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి
-గ్రామ ప్రజలు ఆందోళన చెందవద్దు
-అన్ని విధాలుగా గ్రామ ప్రజలకు అండగా నిలిచి ఆదుకుంటాం జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
కేవిబీ పురం, నేటి పత్రిక ప్రజావార్త :
కె వి బి పురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండి పడి ముంపుకు గురైన ప్రాంతాలను సత్యవేడు ఎం ఎల్ ఎ ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు.
గురువారం సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం ఓలూరు రాయల చెరువు తెగిపోవడంతో పరిసర గ్రామాలైన కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలను సత్యవేడు ఎం ఎల్ ఎ ఆదిమూలం, శ్రీకాళహస్తి ఆర్ డి ఓ. భాను ప్రకాష్ రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు, గ్రామ ప్రజలతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండి పడి ముంపుకు గురికావడం చాలా బాదాకరమన్నారు.అయితే గ్రామంలో చాలా వరకు పశువులు వరదలో కొట్టుకుపోయి చనిపోవడం జరిగిందన్నారు. ముంపు వల్ల ఇల్లు పడిపోయిన వారికి హౌసింగ్ పథకం కింద ఇల్లు నిర్మించడం జరుగుతుందని, పశువులను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నీటిమునిగిన ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు తీసుకుని అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు.ఇక్కడిపరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News