Breaking News

ముందు అవగాహన… ఆ తర్వాతే చలానా

-ట్రాఫిక్ నిబంధనల అమల్లో సరికొత్త మోడల్ అమలు
-రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టండి
-ఆర్టీజీఎస్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన తర్వాతే చలానా విధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి దాని ఆవశ్యకతను వివరించాలని సూచించారు. భారీ ఎత్తున చలానాలు వేయాలన్న అధికారుల ప్రతిపాదనలను సీఎం సున్నితంగా తిరస్కరించారు. చలానాలు వేసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ముందుగా హెల్మెట్లు, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించడంతోపాటు… వారు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే విషయాన్ని వారి ఫోన్లకు మెసేజీలు పంపాలని సూచించారు. ఆ తర్వాత కూడా వారి నిబంధనలు ఉల్లంఘిస్తుంటే అప్పుడు చలానాలు వేయాలని స్పష్టం చేశారు. దీని వల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి తాను తప్పు చేసినందు వల్లే చలానాలు వచ్చాయనే భావన కలుగుతుందని చెప్పారు. ఇందులో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. ఇలాంటివి జరగ్గకుండా ఉండేలా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి… నిర్మాణత్మక ప్రణాళికను తయారు చేయాలని నిర్దేశించారు. దీనికి సంబంధించి ఎస్ఓపీలను సిద్దం చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. జన సమూహాల్లో తొక్కిసలాటలు జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాలను ఏ మేరకు నియంత్రించగలమనే అంశాన్ని కూడా విశ్లేషించాలని చెప్పారు.

రహదారులపై గుంతలు కన్పించకూడదు

పాలనలో తన ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు.
రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు, డ్రైనేజీలు, నీటి నిర్వహణ, ఉద్యోగ, ఉపాధి కల్పన, పంటలకు మద్దతు ధర… ఇవే తన ప్రాధాన్యతలని స్పష్టంగా చెప్పారు. అధికారులు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఇప్పటికీ రోడ్లు సరిగా లేవనే ఫీడ్ బ్యాక్ వస్తుందని అలా జరగకుండా చూసుకోవాలని చెప్పారు. గత పాలనలో రహదారుల నిర్వహణ కూడా పట్టించుకోలేదని… ఆ నిధులను వేరే కార్యక్రమాలకు మళ్లించారని.. అందువల్లే రహదారులు దారుణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కారణలేమైనా.. రోడ్లపై గుంతల్లేకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని… తక్షణం ఈ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదే విధంగా డ్రైనేజీల నిర్వహణ కూడా సరిగ్గా చేపట్టాలని… నిర్వహణ సరిగా లేకపోవడం కారణంగా నీళ్లు నిలిచిపోయే పరిస్థితులు ఉండకూడదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించాలని…వాటి గురించి నిరుద్యోగ యువతకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, రైతులకు సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.

అవినీతి ఉండకూడదు… పనితీరు మెరుగవ్వాలి

ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌరసేవలపైనా ముఖ్యమంత్రి సమీక్షలో చర్చించారు. రిజిస్ట్రేషన్ సేవలు, పారిశుద్ధ్య, రేషన్ పంపిణీ, దీపం-2.0 వంటి పథకాల పనితీరుపై అధికారులతో సమీక్షించారు. గతంతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ల సేవల విషయంలో పనితీరు కొంతమేర మెరుగైందని అన్నారు. కొన్ని చోట్ల కొందరు అధికారుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని… దీన్ని సరిచేసుకునేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. రెండున్నర నెలల్లో రిజిస్ట్రేషన్ సేవల్లో తాను ఆశించిన మార్పులు కన్పించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పార్దసారధి, సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *