Breaking News

స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్న ఏజెన్సీల పనితీరుపై చైర్మన్ పట్టాభిరామ్ అసంతృప్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛాంధ్ర విజన్-2047లో భాగంగా రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు మునిసిపల్, పంచాయతీ సిబ్బందికి, వివిధ సంస్థల వారికి, విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే ఏజెన్సీల పనితీరుపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలోని తన కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ శుక్రవారం ఉదయం, సాయంత్రం ఏఐఐఎల్ఎస్‌జీ( ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్), వాష్ ఇన్‌స్టిట్యూట్ ఏజన్సీలవారితో వేరువేరుగా సమావేశమై ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించారు.
తాము 13 జిల్లాలలోని 70 మునిసిపాలిటీలలో మూడు ఫేజులుగా సీబీ, ఐఈసీ(కెపాసిటీ బిల్డింగ్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్) కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏఐఐఎల్ఎస్‌జీ ఏజన్సీ రీజినల్ డైరెక్టర్ వి.చలపతి రాజ్ చెప్పారు. మన్యం, విజయనగరం, కృష్ణ, శ్రీకాకుళం, చిత్తూరు, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, ఎన్టీఆర్, అన్నమయ్య, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాలలో తాము అవగాహన కల్పించేవారిని 12 కేటగిరీలుగా విభజించినట్లు చైర్మన్ కు వివరించారు. ఇప్పటి వరకు 42 మునిసిపాలిటీలలో 86 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా 4,562 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మునిసిపాలిటీలు, పాఠశాలల్లో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం… వంటి విషయాలలో శిక్షణ ఇచ్చి, వారికి అవగాహన కల్పించినట్లు వివరించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి, వారికి బహుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు.
స్వచ్ఛాంధ్ర విజన్-2047లో భాగంగా తాము 13 జిల్లాలలోని 9 కార్పోరేషన్లు, 38 మునిసిపాలిటీలు, 10 నగర పంచాయతీలలో ట్రైనింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వాష్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ శశాంక్ వివరించారు. శిక్షణ పొందేవారిని వార్డు స్థాయి నుంచి కార్పోరేషన్ స్థాయి వరకు 10 కేటగిరీలుగా విభజించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆయా రంగాలలో ప్రావీణ్యత కలిగిన వారితో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.
చైర్మన్ పట్టాభిరామ్ సూచనలు
నాలుగు నెలల్లో జరిగిన శిక్షణా కార్యక్రమాల తీరుపై కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఫొటోల వంటి కార్యక్రమాల ద్వారా మనల్ని మనం మోసం చేసుకోవద్దని హితవు పలికారు. ఫలితాలపై దృష్టి సారించాలన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందున, అందుకు తగిన ఫలితాలు కనిపించాలని చెప్పారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను సమర్థవంతంగా అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. శిక్షణ పొందినవారికి ఎంతవరకు అవగాహన అయిందో కూడా తెలుసుకోవాలని, వారి అవగాహనా సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి, శిక్షణ తర్వాత వారికి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. పరీక్షలో అధిక మార్కులు వచ్చిన వారికి బహుమతులు కూడా ఇవ్వాలన్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలు, పారిశుద్ధ్యంపై మనం ప్రచారం చేసే అంశాలు ప్రజల్లోకి వెళ్లాలంటే మనం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కళాకారుల ద్వారా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అలాగే, సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేసేవారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వారిని కూడా ఉపయోగించుకోవాలన్నారు. హోటల్స్, ట్రేడర్స్… వంటి ఇతర వ్యాపార సంస్థల అసోసియేషన్ల వారిని సమావేశపరిచి, వారి ద్వారా కూడా మన లక్ష్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు, ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ, పదవీ విరమణ చేసినవారు, వివిధ సేవాదళాల ద్వారా కూడా పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే, వ్యర్థ పదార్థాల ద్వారా డబ్బు సంపాదించే మార్గాలను మహిళలకు తెలిసే విధంగా వివరించాలన్నారు. ఏజన్సీలు భవిష్యత్ ప్రణాళికలు, పూర్తి డేటాతో పక్కాగా రూపొందించుకోవాలని చెప్పారు.
ఈ సమీక్షా సమావేశాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సీఓఓ దశరథరామి రెడ్డి, ఏఐఐఎల్ఎస్‌జీ ఏజన్సీ ప్రాజెక్ట్ మేనేజర్ సీహెచ్ .రాజేష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్. వెంకటేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ ఏ.శివన్నారాయణ, వాష్ ఇన్‌స్టిట్యూట్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *