– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
-కళాకారుల ఉపాధి పెంపే లక్ష్యంగా డిస్కౌంట్ విక్రయాలు
-10, 20, 30 శాతం డిస్కౌంట్లతో కళారూపాల అమ్మకాలు
-ఈ నెలాఖరు వరకూ డిస్కౌంట్లు వర్తింపు
-వినియోగదారులకు ఆకట్టుకునేలా లేపాక్షి షో రూమ్ ల మరమ్మతులు
-మొదటి విడతలో వైజాగ్, అనంతపురం, కడప షో రూమ్ ల అభివృద్ధి
-పూర్తి కావొచ్చిన ఢిల్లీ షో రూమ్
-విడతలా వారీగా మిగిలిన షో రూమ్ ల మరమ్మతులు
-ఆన్ లైన్ లోనూ లేపాక్షి కళా రూపాల అమ్మకాలు : మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ ప్రాంతాలకు చెందిన కళారూపాలకు మార్కెట్ కల్పించడంతో పాటు కళాకారులకు ఆర్థిక భరోసా లభించేలా లేపాక్షి షో రూమ్ ల్లో 30 శాతం వరకూ డిస్కౌంట్ అమ్మకాలు ప్రారంభించినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆయా కళారూపాలను 10, 20, 30 శాతం డిస్కౌంట్లతో అమ్మకాలు చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండగ దృష్ట్యా డిస్కౌంట్ అమ్మకాలు ప్రారంభించామన్నారు. దీనివల్ల కళారూపాలను తక్కువ ధరలకే లభించడంతో పాటు అదే సమయంలో అమ్మకాలు పెరగడం వల్ల కళాకారులకు ఉపాధి పెరిగే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో మూడు లేపాక్షి షో రూమ్ లను వినియోగదారులకు ఆకట్టుకునేలా అభివృద్ధి చేయనున్నామని, ఇందుకోసం ఒక్కో షో రూమ్ నకు రూ.15 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ కామర్స్ లోనూ కళారూపాలను అందుబాటులో ఉంచాలని, ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో లేపాక్షి అధికారులతో మంత్రి సవిత సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని కళారూపాల అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కళారూపాలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని 10, 20 30 శాతంతో డిస్కౌంట్ అమ్మకాలు ఏ మేరకు జరుగుతున్నాయో మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. లేపాక్షి షో రూమ్ ల్లో ఈ నెలాఖరు వరకూ జరిగే డిస్కౌంట్ అమ్మకాలపై మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలన్నారు.
విడతల వారీగా షో రూమ్ ల అభివృద్ధి
రాష్ట్రంతో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో 19 లేపాక్షి షో రూమ్ లు ఉన్నట్లు ఆ సంస్థ ఎండీ విశ్వ తెలిపారు. వాటిలో 16 షో రూమ్ లు ఏపీలోనే ఉన్నాయన్నారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా లేపాక్షి షో రూమ్ లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ఆ నిర్మాణాలు ఉండాలన్నారు. మొదటి విడతలో విశాఖపట్నం, అనంతపురం, కడప లేపాక్షి షో రూమ్ లను అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో షో రూమ్ కు రూ.15 లక్షల చొప్పున వెచ్చిస్తోందన్నారు. ఇప్పటికే చేపట్టిన ఢిల్లీలో ఉన్న లేపాక్షి షో రూమ్ అభివృద్ధి పనులు గురించి మంత్రి వాకబు చేశారు. మిగిలిన 15 షో రూమ్ లను విడతల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
ఆన్ లైన్ లో కళారూపాల అమ్మకాలు
చేనేత వస్త్రాలను ఈ కామర్స్ లో విక్రయించినట్లు లేపాక్షి కళారూపాలను ఆన్ లైన్ లో లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. మారుతున్న పరిస్థితులతో వినియోగదారులు షాపులకు వచ్చి కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారన్నారు. నిత్యావసరాలు, వస్త్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారన్నారు. వినియోగదారుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళారూపాలను ఆన్ లైన్ లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో లేపాక్షి ఎండీ విశ్వ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News