Breaking News

భక్తుల మనోభావాలపై జగన్ దండయాత్ర చేస్తున్నాడు

-కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తోంది.
-ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు.
-గతంలో గోబెల్స్ ప్రచారం గురించి విన్నాం.. ఇప్పుడు అబద్ధాలతో ‘జగన్ బెల్స్’ ప్రచారం చూస్తున్నాం.
-రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ అండ్ టీమ్ విషం చిమ్ముతోంది.
-వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని కించపరిచిన భూమన.. ఇప్పుడు నామాలు పెట్టుకుని మొసలి కన్నీరు కారుస్తున్నారు.
-రాష్ట్ర ఆదాయానికి కీలకమైన ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలని వైసీపీ కంకణం కట్టుకుంది.
-సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థలను బాగు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైందని సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంతృప్తే లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర గ్రోత్ రేట్ (GSDP)తలసరి ఆదాయం పెంచడంపై ముఖ్యమంత్రి గారు నిరంతరం మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు వెళ్ళినట్లు, “దెయ్యాలు వేదాలు వల్లించినట్లు” వైకాపా నాయకుల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. వారు చెప్పే అబద్ధాలు చూస్తుంటే ఆ సామెతలు కూడా తలదించుకోవాల్సి వస్తుందన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో గతంలో ‘గోబెల్స్’ పేరు ఉండేదని, కానీ జగన్ గారి టీమ్ తీరు చూస్తుంటే ఇప్పుడు ‘జగన్ బెల్స్’ అని పిలవాల్సి వస్తుందని విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద పోరాడాల్సింది పోయి, కేవలం బురద చల్లడానికే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని జగన్ మోహన్ రెడ్డి గారి టీమ్ విషం చిమ్ముతోందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తిరుమల పుణ్యక్షేత్రం కోట్లాది మంది హిందువుల నమ్మకానికి నిలువుటద్దమని, అటువంటి పవిత్ర స్థలంపై వైకాపా నాయకులు అవాస్తవాలతో కుట్రలు చేస్తున్నారు. ఈ ఏడాది టిటిడి (TTD) బోర్డు వైకుంఠ ఏకాదశి దర్శనాలను చాలా పద్ధతిగా, నిబంధనల ప్రకారం నిర్వహించింది. గతంలో వైకాపా నేతలు అక్కడ తమ పెత్తనం చెలాయించేవారని, ఇప్పుడు అది సాగకపోవడంతో ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయని చేసిన ప్రచారం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కింద తిరుపతిలో ఖాళీ మద్యం సీసాలు కొని, వాటిని కొండపైకి తీసుకెళ్లి పెట్టి అపవిత్రం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన వేల సంఖ్యలోని సీసీ కెమెరాల వల్ల ఈ కుట్ర బయటపడింది. ఈ పనికి పాల్పడిన వారు పోలీసులకు చిక్కారని, వారు సాక్షి పత్రిక విలేకరులు లేదా భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులని తిరుపతిలో చర్చ జరుగుతోందని అన్నారు. పైన ఉన్నది కేవలం నల్లరాయి మాత్రమే అని గతంలో స్వామివారిని కించపరిచిన భూమన, ఈరోజు ఒళ్ళంతా నామాలు పెట్టుకుని హిందువునని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పట్టుబడిన వారు మీ మనుషులు కాదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ‘టూరిజం’ (పర్యాటకం) ఒక గొప్ప వనరు అని, అందులోనూ ఆధ్యాత్మిక పర్యాటకం ఎంతో కీలకమని ఈ రంగాన్ని అభివృద్ధి చేసి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం చూస్తుంటే, వైకాపా మాత్రం దేవుళ్ల మీద కూడా విష ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో కనీసం 20% కూడా స్వచ్ఛత లేదని, కేవలం ముడుపుల కోసమే తక్కువ నాణ్యత గల సంస్థల నుంచి నెయ్యి కొన్నారని ఆరోపించారు. పామాయిల్, జంతువుల కొవ్వు కలిసిందన్న వార్తలపై ఎంక్వైరీ జరుగుతోందని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. దేవుడి మీద నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డికి చైర్మన్ పదవి ఇచ్చి, తిరుమల నిధులను భక్తుల సౌకర్యాల కోసం కాకుండా, కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం తిరుపతిలో ఇష్టానుసారంగా ఖర్చు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం తిరుపతి లాంటి పవిత్ర స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ముంతాజ్ హోటల్‌కు అనుమతి ఇస్తే, కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసి హిందువుల సెంటిమెంట్‌ను కాపాడిందని తెలిపారు.
వైకాపా అధికారం పోయినా బుద్ధి తెచ్చుకోకుండా అనేక అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఎక్కడో పాత ఫోటోలు తెచ్చి తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రగిరి టోల్ గేట్ దగ్గర ఉన్న బారికేడ్లను చూపిస్తూ తిరుమలలో ఏదో కొత్తగా పెట్టారని అబద్ధాలు చెప్పారు. భక్తులు సహజ కారణాలతో మరణిస్తే, అది తొక్కిసలాట వల్ల జరిగిందని తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారు. స్వామివారి పరకామణిలో దొంగతనం జరిగితే దోషులను శిక్షించకుండా ‘సెటిల్మెంట్’ చేసి కేసును నీరుగార్చారని ఆరోపించారు. వైకాపా హయాంలో ఏ కేసు జరిగినా అందులో సాక్షులు చనిపోవడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయినట్లే, పరకామణి కేసులో సాక్షిగా ఉన్న అధికారి కూడా అనుమానాస్పద స్థితిలో రైలు నుంచి పడి చనిపోవడం ఘోరమని వ్యాఖ్యానించారు. అన్యమతస్థులు హిందూ దేవాలయాలను దోచుకున్నట్లుగానే, వైకాపా పాలనలో కూడా అటువంటి పరిస్థితులే ఉండేవని, భక్తులు ఈ వాస్తవాలను గమనించాలన్నారు. పరిటాల రవి హత్య కేసులో తొమ్మిది మంది సాక్షులు చనిపోయారని, వైకాపాకు సంబంధించిన ఏ కేసు చూసినా సాక్షులు మాయమైపోవడం లేదా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో లక్ష్యాలతో ముందుకు వెళ్తుంటే, ప్రజల దృష్టిని మళ్లించడానికి వైకాపా కుట్రలు చేస్తోందని విమర్శించారు. “మీరు అభివృద్ధికి సహకరించకపోయినా పర్వాలేదు కానీ, నోరు మూసుకుని ఉండండి.. రాష్ట్రం మీద విషం చిమ్మకండి” అని ఘాటుగా హెచ్చరించారు. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు పూతకు సంబంధించిన కిలోల కొద్దీ బంగారాన్ని దోచేశారని ఆరోపించారు. చివరికి విఐపిలకు కప్పే శాలువాల కొనుగోలులో కూడా అవినీతి చేశారంటే డబ్బు కోసం వైకాపా నాయకులు ఎంత కక్కుర్తిగా దిగజారిపోయారో ప్రజలు గమనించాలన్నారు. గత ఐదేళ్లలో జరిగిన దోపిడీలను కప్పిపుచ్చుకోవడానికే వైకాపా ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ప్రజలు వాస్తవాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *