-మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఏర్పాట్లు
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో సమర్థవంతంగా జన గణన చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (జీపీఎం & ఏఆర్) ఎస్.ఎస్.రావత్.. అన్ని జిల్లాల కలెక్టర్లతో జనగణన కార్యక్రమాల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెన్సస్ రెండు దశల్లో జరగనున్న నేపథ్యంలో హౌస్ లిస్టింగ్, హౌస్ టు హౌస్ సర్వేల నిర్వహణ సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జనగణనకు సంబంధించి రాష్ట్ర, జిల్లా, సబ్ డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారుల నియామకంపై ఇప్పటికే ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ఆయా అధికారుల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొలిసారిగా డిజిటల్ విధానంలో సెన్సస్ జరగనున్న నేపథ్యంలో అత్యంత పారదర్శకంగా జన గణనకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రత్యేక ప్రణాళికలతో సరైన కార్యాచరణ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ముఖ్య జన గణన అధికారిగా కలెక్టర్, అదనపు ముఖ్య జన గణన అధికారిగా జాయింట్ కలెక్టర్, జిల్లా జన గణన అధికారిగా డీఆర్వో వ్యవహరించనున్న నేపథ్యంలో ఆ అధికారుల స్థాయిలో తీసుకోవాల్సిన స్పష్టతతో ముందడుగు వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News