Breaking News

మార్షల్ ఆర్ట్స్ లో మీ విజయం స్ఫూర్తిదాయకం

-దశాబ్దాల సాధనతో యువతరానికి అద్భుత సందేశం ఇచ్చారు
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అభినందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు సందేశాన్ని పంపారు. “జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాను. కెంజుట్సు లో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇటు ప్రజా జీవితంలో, అటు సినిమా కెరీర్ లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో, నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయం. మార్షల్ ఆర్ట్స్ లో దశాబ్దాలపాటు అంకిత భావంతో మీరు చేసిన సాధన స్ఫూర్తిదాయకం. మీ విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని యువతరానికి ఇచ్చారు.
యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతోపాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం. ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది.
ఆరోగ్యకరమైన, చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో రూపొందించిన ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలకు ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. ఫిట్నెస్ పట్ల మీకున్న క్రమశిక్షణ, నిబద్దత ఎంతో మందికి ప్రేరణ ఇస్తుంది. మీరు సాధించిన ఈ విజయానికి మరోసారి అభినందనలు. భవిష్యత్తులో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.

– మీ అభినందన సందేశం నాకు గొప్ప గౌరవం : పవన్ కళ్యాణ్

అభినందన సందేశం పంపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మోదీ కి కృతజ్ఞత సందేశ లేఖను పంపించారు. “మోదీజీ పంపిన ఆత్మీయ అభినందన సందేశం నాకు గొప్ప గౌరవం. ప్రేమపూర్వకమైన మీ సందేశం నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తాయి. యుద్ధకళల పట్ల క్రమశిక్షణ, ఏకాగ్రత ఏళ్ల తరబడి నా జీవిత ప్రయాణంలో అంతర్భాగంగా ఉంది. యుద్ధకళలు శారీరక శ్రమ, ఏకాగ్రతతోపాటు ఒత్తిడిని తట్టుకునే శక్తినిస్తాయి. జీవిత కాల అభ్యాసం, స్వీయ వృద్దిపై మీరిచ్చిన సందేశం ఎంతో స్ఫూర్తినిస్తుంది.
ప్రజారోగ్య పరిరక్షణ కోసం మీరు తీసుకువచ్చిన ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలు మీ దూరదృష్టికి నిదర్శనం. మీ నాయకత్వంలో బలమైన మరియు దృఢమైన భారతదేశం నిర్మితమవుతుంది. స్వామి వివేకానంద ఆకాంక్షించిన బలమైన సమాజం ఆవిష్కృతం అవుతుంది. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణగల సమాజం కోసం నిరంతరం మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రతి భారతీయుడికీ ప్రేరణనిస్తాయి. మీలాంటి గొప్ప నాయకుడి నుంచి లభించిన ఈ ప్రోత్సాహం అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలన్న నా సంకల్పానికి మరింత బలాన్నిస్తుంది. ప్రతి అడుగులో మీరిస్తున్న మద్దతుకు రుణపడి ఉంటాను” అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *