-రాష్ట్ర ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు
-లక్ష్యాన్ని 90 వేల నుంచి 2.50 లక్షల విద్యార్దులకు పెంచిన కేంద్రం
-అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గత రెండు సంవత్సరాలుగా అమలు చేస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం)తాజా నివేదికలో ప్రశంసించింది. రాష్ట్రంలో అమలవుతున్న ఉత్తమ విధానాల(బెస్ట్ ప్రాక్టీసెస్)ను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలుచేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని కేంద్రం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి కేటాయించిన కంటి అద్దాల పంపిణీ వార్షిక లక్ష్యాన్ని 90 వేల నుంచి ఏకంగా 2.50 లక్షలకు కేంద్రం పెంచడం విశేషం. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించడంపై అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అభినందించారు.
ఇదే స్ఫూర్తిని ఇకమీదట కూడా కొనసాగిo చాలని మంత్రి పిలుపునిచ్చారని వైద్య, ఆరోగ్య శాఖ ఫ్రైడే ఓ ప్రకటన లో తెలిపిoది.
కంటి పరీక్షలు, అద్దాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక
జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నారు. సంబంధించిన వ్యయంగా రూ.3 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నాయి. ప్రతి కంటి అద్దానికి గరిష్ఠంగా రూ.280 వరకు వ్యయం అవుతోంది.
ఆరు నుంచి పద్దెనిమిది ఏళ్లలోపు వయస్సు గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పారా మెడికల్ ఆఫాల్మిక్ ఆఫీసర్లు / పారా మెడికల్ ఆఫాల్మిక్ అసిస్టెంట్ల ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. 6/12 కంటే తక్కువ కంటి చూపు ఉన్న విద్యార్థుల్లో 90 వేల మందికి కంటి అద్దాలు అందజేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిర్దేశించినధి. ప్రాంతాల వారీ పరిస్థితులు, విద్యార్థుల ఆర్దిక నేపద్యం ఆధారంగా పాఠశాలలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కంటి అద్దాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ
ప్రతి ఏడాది నవంబర్ నెలలో కంటి పరీక్షలు పూర్తయిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంఘం (District Blindness Control Society) ద్వారా ఓపెన్ టెండర్ విధానంలో కంటి అద్దాల సరఫరా సంస్థలను ఎంపిక చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలోపు కంటి అద్దాల పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. టెండర్ల ద్వారా ఎంపికైన సంస్థలు సరఫరా చేసే కంటి అద్దాల నాణ్యతను ‘లెన్సో మీటర్’ ద్వారా పరీక్షిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని అద్దాలను తిరస్కరించి, ప్రత్యామ్నాయంగా నాణ్యమైన అద్దాలను సరఫరా చేయిస్తున్నట్లు అంధత్వ నివారణ కార్యక్రమ రాష్ట్ర సమన్వయకర్త, సంయుక్త సంచాలకులు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ తెలిపారు. జిల్లాల వారీగా పరీక్షల పురోగతి, సిబ్బంది నియామకం, టెండర్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడంపై నిరంతర సమీక్షలు నిర్వహించడంతో ఆశించిన ఫలితాలు సాధ్యమవుతున్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలో కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీ పురోగతి సంతృప్తికరంగా ఉండటంతో 90 వేలకు బదులు 2026–27 విద్యా సంవత్సరానికి 2.50 లక్షల మంది విద్యార్థులకు కంటి అద్దాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనివల్ల సుమారు రూ.7.70 కోట్ల వరకు వ్యయమవుతుంది.
ఎన్జీఓ ల చేయూత
2024–25 సంవత్సరానికి 90 వేల మందికి కంటి అద్దాలు పంపిణీ చేయాలన్న లక్ష్యానికి గాను 1,89,102 మందికి అద్దాలు అందించారు. 2025–26 సంవత్సరానికి ఇప్పటివరకు 94,689 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. లక్ష్యానికి మించి విద్యార్థులకు సేవలు అందించేందుకు సేవా సంస్థలు కూడా ముందుకు రావడం విశేషo
Prajavartha Online Telugu News