Breaking News

మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ సమావేశం

-ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయండి
-ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు సక్రమంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళలు, పిల్లలు, వికలాంగులు & వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో మహిళలు, పిల్లలు, వికలాంగులు & వృద్ధుల సంక్షేమంపై అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతి పై శాసన సభ డిప్యూటీ సెక్రటరీ ఆర్ వనిత రాణి, జిల్లా కలెక్టర్. డా వెంకటేశ్వర్, కమిటీ సభ్యులతో కలసి ఛైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధికారులు ఆయా శాఖల ద్వారా అమలవుతున్న పథకాల వివరాలను కమిటీకి సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు, మహిళల భద్రత, పోషణ పథకాలు, గర్భిణీ మహిళలు మరియు బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న హింస నివారణకు తీసుకుంటున్న చర్యలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని సూచించారు. పిల్లల సంక్షేమంలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల సంరక్షణ గృహాల నిర్వహణ, విద్యా-ఆరోగ్య సేవల నాణ్యత పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బాలుడు విద్య, ఆరోగ్యం పొందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కమిటీ ఆదేశించింది. వికలాంగుల సంక్షేమానికి సంబంధించి దివ్యాంగుల పింఛన్లు, ఉపకరణాల పంపిణీ, విద్యా మరియు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ భవనాలు దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వికలాంగుల సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధుల సంక్షేమానికి సంబంధించి వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్య సేవలు, వృద్ధాశ్రమాల నిర్వహణ, సామాజిక భద్రతా చర్యల అమలుపై కమిటీ సభ్యులు అధికారులతో చర్చించారు. వృద్ధుల పట్ల గౌరవం, సంరక్షణతో కూడిన సేవలు అందేలా చర్యలు మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకతతో సమర్థవంతంగా అమలు చేస్తూ లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత చురుకుగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శాసనసభ కమిటీ సభ్యులు పల్లె సింధూర రెడ్డి, లోకం నాగమాధవి, వరపుల సత్యప్రభ, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ రెడ్డి, కల్పలత, మధుసూదన్, డిఆర్ఓ జి నర్సింహులు, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. వినోద్ కుమార్, ఐసిడిఎస్ అధికారిని వసంతబాయి, సోషల్ వెల్ఫేర్ డిడి విక్రమ్ కుమార్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రాజా సోము, బీసీ వెల్ఫేర్ డిడి భరత్ కుమార్ రెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి చెన్నారెడ్డి, డిఆర్డిఏ పిడి ప్రభావతి, మెప్మా పిడి ఇఫ్రామ్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఛైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ . . కమిటీ ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం ఆధ్యాత్మిక పేరు గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిరహించాలని అనుకున్నామని తెలిపారు. తిరుపతి జిల్లాలో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫర్ శాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును సుదీర్ఘంగా సమీక్షించామన్నారు. తిరుపతి జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు సంతృప్తికరంగా ఉందన్నారు. కమిటీ సమావేశం సందర్భంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులకు సంబంధించి సి.ఎస్.ఆర్ ఇతరత్రా నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకు, మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు వృద్ధాశ్రమాల ద్వారా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళితే మెరుగైన ఫలితాలను ఆశించవచ్చన్నారు. రాష్ట్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చి ముందుకెళుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా కమిటీలో ఉన్న వారు కృషి చేస్తున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *