Breaking News

నేటి (జనవరి 24) నుండి విశాఖ ఉత్సవ్ ప్రారంభం

-ఫిబ్రవరి 1 వరకు కొనసాగనున్న సంబురం
-ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ కు కూటమి ప్రభుత్వం శ్రీకారం
-సముద్ర తీరానికి రండి… సంస్కృతిలో ఓలలాడండి… కొండల అందాలను ఆస్వాదించండి…ఇదే విశాఖ ఉత్సవ్ ఉద్దేశం
-వైజాగ్–అనకాపల్లి–అరకు ప్రాంతాలను భారతదేశపు సమీకృత గ్లోబల్ కోస్టల్–హిల్ గ్రోత్ కారిడార్‌గా నిలబెట్టే దిశగా అడుగులు
-విశాఖ ఉత్సవ్ ప్రజల పండుగ, మన సంస్కృతికి అద్దం పట్టే వేదిక అని తెలిపిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎప్పుడెప్పుడా అని ఎదురురచూస్తున్న విశాఖ ఉత్సవ్ కు సర్వత్రా రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దీర్ఘకాలిక అభివృద్ధి దార్శనికతకు అనుగుణంగా, రాష్ట్ర నాయకత్వ చురుకైన సహకారంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ “విశాఖ ఉత్సవం”ను నేడు ప్రారంభించనుంది. “సీ టు స్కై” (Sea to Sky) అనే వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందించబడిన ఈ ఉత్సవం, భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ మరియు తీరప్రాంత పండుగగా పర్యాటక రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ వేడుకలు అతిరథ మహారథుల సమక్షంలో నేడు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. వినోదం, సంస్కృతి, సాహస క్రీడలు, ఆహారం మరియు సామాజిక భాగస్వామ్యం కలగలిసిన భారీ వేడుక ఇది. ఇప్పటికే మైసూర్, కోల్‌కతా స్థాయిలో విజయవాడ దసరా ఉత్సవాలను నిర్వహించి ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం అమరావతిలో నిర్వహించిన ‘ఆవకాయ్ – ఫెస్టివల్ ఆఫ్ సినిమా & లిటరేచర్’ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ తరహాలో మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పింది. అదే విధంగా గండికోట ఉత్సవ్, ఫ్లెమింగో ఫెస్టివల్, కోనసీమ ప్రభల తీర్థాన్ని నిర్వహించి అదే స్ఫూర్తితో విశాఖ ఉత్సవ్‌ను భారతదేశపు అతిపెద్ద కోస్టల్ (తీరప్రాంత) పండుగగా నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. 26 కిలోమీటర్ల సుందరమైన తీరప్రాంతం ప్రధాన కేంద్రంగా సాగే ఈ ఉత్సవం, ప్రాంతీయ అభివృద్ధిని మరియు పర్యాటక గర్వాన్ని చాటిచెబుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకురానుంది. విశాఖ ఉత్సవం కేవలం వేడుక మాత్రమే కాదు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఒక గొప్ప ఊతం. ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖలతో, అధికారులతో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ అధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి కాటలు సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేలా ప్రణాళికలు రచించారు. సముద్ర తీరానికి రండి… సంస్కృతిలో ఓలలాడండి… కొండల అందాలను ఆస్వాదించండి అంటూ మంత్రి కందుల దుర్గేష్ ఈ వేడుకకు పిలుపునివ్వడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.

విశాఖ ఉత్సవ్ – “సాగరం నుండి శిఖరం వరకు”(Sea to Sky)

విశాఖ ఉత్సవం కేవలం విశాఖ నగరానికే పరిమితం కాదు, ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రయాణం. విశాఖకు బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొచ్చే విధంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. 20 వేదికలు, 500 కు పైగా ఈవెంట్లలో 650 మంది కళాకారులు పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవం ద్వారా దాదాపు రూ.500 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగేందుకు అవకాశం ఉంది. జీడీపై ప్రభావం చూపనుంది ఈ వేడుక. తద్వారా హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్ మరియు క్రియేటివ్ రంగాల్లో 3000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలిగే అవకాశం ఉంది. 1,800 మంది సహాయక సిబ్బందికి ఉపాధి లభిస్తుంది. ఇది స్థానిక జీవనోపాధిని మరియు హాస్పిటాలిటీ రంగాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని కూటమి ప్రభుత్విం భావిస్తోంది. అంతేగాక 500 మందికి పైగా చిన్న వ్యాపారులు (MSMEs), కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చింది పర్యాటకశాఖ.

వైజాగ్ – అనకాపల్లి – అరకు అభివృద్ధి కారిడార్ “సీ టు స్కై” అనే కాన్సెప్ట్ ఈ మూడు ప్రాంతాలను ఒకే పర్యాటక మరియు అభివృద్ధి వారధిగా అనుసంధానిస్తుంది. సీ టూ స్కై స్లోగన్ తో జరిగే ఈ ఉత్సవంలో భాగంగా సముద్ర తీర అందాలతో అలరారుతున్న విశాఖపట్నం గ్లోబల్ కోస్టల్ ఎకాలజీకి వేదికగా, అనకాపల్లి వారసత్వం, హస్తకళలు, ఎకో-టూరిజం, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ, సంస్కృతి, రుచికరమైన వంటకాలు మరియు ఎంఎస్ఎంఈలకు చిరునామాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో గిరిజన సంస్కృతి, గిరిజన వారసత్వం, ఎకో-టూరిజం, సాహస క్రీడలు, సాంస్కృతిక వినోదం, స్థిరమైన జీవనోపాధి, ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా ఈ ఉత్సవాలు సాగనున్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యక్రమం జరుగనుంది. ఈ ప్రాంతాలన్నీ కలిసి ఒక సమతుల్య, సమగ్రమైన మరియు ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన పర్యాటక కారిడార్‌గా రూపుదిద్దుకుంటున్నాయి.

ఇది ప్రజల పండుగ, మన సంస్కృతికి అద్దం పట్టే వేదిక: మంత్రి కందుల దుర్గేష్

విశాఖ-అనకాపల్లి-అరకు ప్రాంతాలను ఒకే పర్యాటక జోన్‌గా కలిపి అభివృద్ధి చేస్తోంది పర్యాటక శాఖ. జీఐ ట్యాగ్ పొందిన అరకు కాఫీని, అక్కడి ప్రత్యేకమైన వాతావరణాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం తద్వారా ఇక్కడి గిరిజన సంస్కృతిని ఫరిడవిల్లేలా చేస్తోంది. హిమాలయాల వెలుపల మంచు కురిసే అరుదైన ప్రాంతం మన అందమైన అరకు. విశాఖ ఉత్సవ్ ద్వారా దానికి మరింత పర్యాటక సొబగులు అద్దుతోంది పర్యాటక శాఖ. గోవా కార్నివాల్ ఎలాగైతే ప్రపంచాన్ని ఆకర్షిస్తుందో, అదే స్థాయిలో మన విశాఖ ఉత్సవ్‌ను తీర్చిదిద్దుతోంది. ఇది ప్రజల పండుగ, మన సంస్కృతికి అద్దం పట్టే వేదిక అని మంత్రివర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

విశాఖ ఉత్సవ్ కు దాదాపు 10 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా

జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు (9 రోజుల పాటు) జరిగే ఈ వేడుకకు సుమారు 10 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా.. ఉదయం వేళల్లో పరేడ్లు, బోటింగ్, బీచ్ వాలీబాల్, కబడ్డీ, హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ అనుభవాలు, సైక్లింగ్, బోట్ రైడ్స్ తదితర అడ్వెంచర్ స్పోర్ట్స్, యోగా, ఆర్ట్ ఇన్‌స్టాలేషన్స్ మరియు పిల్లల కోసం ప్రత్యేక పోటీలు, ముగ్గుల పోటీలు వంటల పోటీలు, పాటలు మరియు నృత్య పోటీలు తదితర ఫ్యామిలీ యాక్టివిటీస్ ఉంటాయి. అదే విధంగా ధ్యాన శిబిరాలు మరియు దేవాలయ జాతర వేడుకలు ఉంటాయి. సాయంత్రం స్థానిక కళాకారులు, జాతీయ స్థాయి సినీ తారలు మరియు లైవ్ బ్యాండ్‌ల చేత అద్భుత ప్రదర్శనలు, విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు, కామెడీ షోలు, నైట్ మార్కెట్లు, సంగీత విభావరిలు, ఫ్లీ మార్కెట్, ఫుడ్ స్టాల్స్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు, విజిటర్ మార్కెట్లు మరియు బీచ్ షాక్స్ తదితర ప్రజలను అలరించే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ షోలు, బాణసంచా ప్రదర్శనలు మరియు ఏరియల్ యాక్ట్స్ ఉంటాయి.

వేదికలు, ప్రాంతాలు & కార్యక్రమాలు

విశాఖపట్నంలో జనవరి 24 నుండి 31 వరకు కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆర్.కె. బీచ్ ప్రధాన వినోద వేదిక కానుంది. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం 6:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు లైవ్ కచేరీలు మరియు డ్రోన్ షోలు నిర్వహించబడుతాయి. ఎంజీఎం గ్రౌండ్స్ లో ప్రారంభ వేడుక, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుష్ప ప్రదర్శన, కిడ్స్ జోన్‌లు, ఆహార మరియు షాపింగ్ స్టాల్స్ ఉండనున్నాయి. రుషికొండ బీచ్ లో సాహస, జల క్రీడలు, స్కూబా డైవింగ్, హెలికాప్టర్ రైడ్స్ జరుగుతాయి. పోర్ట్ స్టేడియం లో 50% తగ్గింపు ధరతో వినోద క్రీడలు, వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి. సాగర్ నగర్ బీచ్ లో లైఫ్ స్టైల్, విశ్రాంతి జోన్‌లు ఉండనున్నాయి. జనవరి 27,28లో భీమిలి బీచ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు, బోట్ రేసులు జరుగుతాయి. జనవరి 31న కార్నివాల్ వాక్ జరుగుతుంది. విశాఖలోని సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ లో జనవరి 28,29న ఉదయం 10:00 గంటల నుండి వంటల పోటీలు జరుగుతాయి.

అనకాపల్లి జిల్లా బొజ్జన కొండలో జనవరి 29 , 30 తేదీల్లో ధ్యానం, వారసత్వ కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక ఉపమాక, నూకాంబిక ఆలయాల్లో జానపద నృత్య కార్యశాలలు జరుగుతాయి. కొండకర్ల ఆవ లో ఎకో-టూరిజం వర్క్‌షాప్‌లు, హస్తకళలు మరియు బోటింగ్ నిర్వహించబడుతాయి. ముత్యాలంపాలెం, రేవు పోలవరం బీచ్‌లో పారామోటార్ రైడ్స్ జరుగుతాయి. బెల్లం మార్కెట్ యార్డ్ లో ఫ్లీ మార్కెట్ మరియు సామాజిక వినోద కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక ఎన్.టి.ఆర్ స్టేడియం సాంస్కృతిక ప్రదర్శనలు మరియు స్టార్ కన్సర్ట్స్ నిర్వహించబడుతాయి. జనవరి 29న రామ్ మిరియాల లైవ్ ఫర్ఫార్మెన్స్ జరుగుతుంది. 30 జనవరిన సింగర్స్ సునీత / భీమ్స్ సిసిరోలియో సంగీత విభావరి జరుగనుంది.

అరకులో 30 జనవరి, 1 ఫిబ్రవరిన సైక్లింగ్ ట్రైల్స్, గిరిజన ఊరేగింపులు, జానపద ప్రదర్శనలు, నేచర్ వాక్స్, కాఫీ ఫెస్టివల్స్, ఎకో-టూరిజం మరియు అరకు పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ సాంస్కృతిక వినోద కార్యక్రమాలు జరుగుతాయి.

విశాఖ అంతర్జాతీయ ఖ్యాతి – ఒక చారిత్రక సందర్భం

విశాఖపట్నం నేడు ఒక వ్యూహాత్మక మలుపులో నిలిచి ఉంది. లోతైన సముద్ర ఓడరేవు, అంతర్జాతీయ విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్లు, సాంకేతిక వ్యవస్థ, నావికాదళ ఉనికి మరియు ప్రపంచ స్థాయి తీరప్రాంతంతో విశాఖపట్నం గ్లోబల్ మార్కెట్‌కు భారతదేశపు తూర్పు ముఖద్వారంగా ఎదుగుతోంది. విశాఖ ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు; ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పర్యాటకులు మరియు సంస్థలకు ఒక వ్యూహాత్మక సంకేతం. మౌలిక సదుపాయాలు, పాలన, భద్రత, జీవనశైలి మరియు అభివృద్ధి స్థాయిలో విశాఖ నగరం ప్రపంచంలోని ప్రముఖ తీరప్రాంత నగరాలతో పోటీపడగలదని ఈ ఉత్సవం ప్రపంచానికి చాటిచెబుతోంది.

పర్యాటకుల భద్రతే తొలి ప్రాధాన్యత

పర్యాటకుల భద్రతే తొలి ప్రాధాన్యతగా, పోలీస్, మున్సిపల్, ఫైర్, మెడికల్ మరియు రవాణా శాఖల సమన్వయంతో ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ‘శ్రేయాస్ మీడియా’ సంస్థ సహకరిస్తోంది. విశాఖను “ఇండియాస్ గ్లోబల్ యూత్ & టూరిజం క్యాపిటల్” గా మార్చడమే అంతిమ లక్ష్యంగా ఉత్సవం జరుగనుంది. అందులో భాగంగా 2026 ను ఫౌండేషన్ ఇయర్ గా, 2027 లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, 2028 లో ఆసియాలోనే అత్యుత్తమ కోస్టల్ ఫెస్టివల్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

విశాఖ ఉత్సవ్ ను విజయవంతం చేయాలని పిలుపు

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉత్సవ వాతావరణం కనిపిస్తుందంటే అందుకు కారణం పరిపాలన దక్షుడైన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహకారం వల్లనే సాధ్యమైందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మీ పిల్లలు, పెద్దలతో కలిసి రండి, పండుగను ఆస్వాదించండి అని కుటుంబాలకు, ఇది మీ వేదిక, మీ ఉత్పత్తులను ప్రపంచానికి చూపండి అని వ్యాపారులకు, కళాకారులకు, ఈ ఉత్సవం మీది, మీ ఉత్సాహమే దీనికి ప్రాణం అని యువతకు, “సాగరం నుండి శిఖరం వరకు” ప్రయాణాన్ని ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లండని మీడియా ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ‘విశాఖ ఉత్సవ్-2026’ ను విజయవంతం చేయాలని కోరారు.

ఇప్పటికే విశాఖ ఉత్సవ్ పై స్థానిక ప్రజాప్రతినిధులు, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీమతి వంగలపూడి అనిత, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి, శ్రీ కొల్లు రవీంద్ర గారు పాల్గొని ఉత్సవాల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ ఉత్సవాల ప్రారంభ వేడుకలు విశాఖపట్నం లో వైభవంగా మొదలై తొమ్మిది రోజుల పాటు ఘనంగా సాగి అనకాపల్లిలో ముగుస్తాయని,తద్వారా విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను ప్లాన్ చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూనే, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో భద్రత, రవాణా, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *