Breaking News

ఏపీ అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా లోకేశ్’

– మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు
– భారీ కేక్ కట్ చేసి మంత్రి లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
– మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్, మెడికల్ క్యాంపుల ఏర్పాటు
– మెడికల్ క్యాంపులో 350 యూనిట్ల రక్తం దానం, 500 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనే పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీ ‘నారా లోకేశ్’ అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదానం, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదాన శిభిరాలు నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర రక్తదానం చేసిన వారిని అభినందించారు. పండ్ల రసం అందించి ధృవీకరణ పత్రాలు అందించారు. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో సుమారు 2000 మంది పాల్గొన్నారు. 350 మంది రక్తదానం చేశారు. ఒక రోజులో ఇంత మంది రక్తదానం చేయడం ద్వారా జిల్లాలో రికార్డు సృష్టించాలని మంత్రి పేర్కొన్నారు. మెడికల్ క్యాంపులో పరీక్షలు అనంతరం 500 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కేంద్రాల్లో భోజనం వడ్డించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో రక్తదానాలు, అన్నదానాలు, మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏకైక కారణం నారా లోకేశ్ రాష్ట్రం కోసం పడుతున్న కష్టమేనన్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకుని, ప్రపంచ బ్యాంకులో పని చేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. తాత, తండ్రి స్ఫూర్తితో ప్రజల కోసం పని చేయాలని వస్తే.. ఎన్నో రకాలుగా అవమానించారు. మాట్లాడితే హేళన చేశారు. బాడీ షేమింగ్ చేశారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం అన్నింటినీ తట్టుకుని తనను తాను నిరూపించుకున్నారు. పాదయాత్రతో ప్రజా నాయకుడిగా ఎదిగారు. పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు సృష్టించినా అన్నింటినీ పంటి బిగువున భరించి పట్టువదలని విక్రమార్కునిలా ప్రతి ఒక్కరిని కలిశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒక్క జూమ్ మీటింగుతో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అర్సెల్ మిట్టల్ పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చారు. అనేక దేశాలు పోటీ పడినా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ డేటా సెంటర్‌ను ఏపీకి రప్పించారు. ఇప్పుడు కూడా దావోస్‌లో మైనస్ 6 డిగ్రీల చలిలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం శ్రమిస్తున్నారు. రాష్ట్రం కోసం నారా లోకేశ్ పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించి ఈ స్థాయిలో పుట్టిన రోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆశీర్వాదాలు అందిస్తున్నారు.

నెల రోజుల క్రితం వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల పేరుతో వైసీపీ నేతలు రప్పా రప్పా అంటూ మూగజీవాలను నరికి రాక్షసుల్లా రక్తాభిషేకాలు చేసుకున్నారు. నిండు గర్భిణిని కడుపులో తన్నారు. ఇళ్ళపై దాడులకు తెగబడ్డారు. కానీ నేడు ప్రజలకు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సేవ చేసే వారికి.. రాక్షసానందం పొందేవారికి తేడా ఇక్కడే స్పష్టంగా తెలుస్తోందన్నారు.

పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు చేసినా జనం జగన్ రెడ్డిని నమ్మరు

ఐదేళ్లు అరాచకాలు చేసి, అకృత్యాలకు పాల్పడిన వైసీపీ నేతలు ఇప్పడు నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చురకలంటించారు. వైసీపీ భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకత్వానికే నమ్మకం లేదు. వారి అరాచకాలను ప్రజలు గుర్తించి అథ:పాతాళానికి తొక్కేశారు. వైసీపీ భవిష్యత్ అంధకారంగా మారిపోయింది. అందుకే పాదయాత్ర పేరుతో చిరు దీపం వెలిగించేందుకు జగన్ రెడ్డి అవస్థలు పడుతున్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి లేనిపోని అభాండాలు వేస్తున్నాడు. చివరికి సిగ్గులేకుండా క్రెడిట్ చోరీకి నానా గడ్డీ కరుస్తున్నారు. ఒకప్పుడు ట్రాక్టర్లతో దున్నేయాలి, ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్ బస్ అవసరమా అన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు భోగాపురం క్రెడిట్ తనదే అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతున్నాడు.

పాదయాత్ర కాదు పొర్లు దండాలు పెట్టినా జగన్ రెడ్డిని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. భూముల రీ సర్వే పేరుతో కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూముల దోపిడీకి కుట్ర చేశాడు. తాతల నుండి వచ్చిన ఆస్తి పత్రాలపై కూడా సిగ్గులేకుండా తన బొమ్మలేసుకున్నాడు. సర్వే రాళ్లపై తన బొమ్మలు పేరుతో రూ.750 కోట్లు దోపిడీ చేశాడు. సర్వే పేరుతో దోచుకున్నారు. పిల్లలు తినే తిండిపై, స్కూల్ బెల్టులు, పుస్తకాలపై చివరికి కోడిగుడ్లపై కూడా తన బొమ్మలేసుకున్నాడు. నేడు ఏ ప్రభుత్వ పథకమైనా.. ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు అనే కనీస జ్ఞానం లేకపోతే ఎలా? అసెంబ్లీకి రాకుండా దొంగ సంతకాలు పెట్టి జీతాలు తీసుకోవడానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలి. ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని అనే కనీస ఇంగితం లేని వ్యక్తి జగన్ రెడ్డి. ఇప్పటికైనా జగన్ రెడ్డి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే 11 సీట్లు కూడా గల్లంతవ్వడం తధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్, జనసేన ఇంఛార్జి బండి రామకృష్ణ, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరందకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబాప్రసాద్, గొర్రెపాటి గోపీచంద్ గారు, టౌన్ అధ్యక్షులు లోగిశెట్టి స్వామి గారు, మండల అధ్యక్షులు కాగిత వెంకటేశ్వర రావు గారు, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ గారు, లంకె నారాయణ ప్రసాద్ గారు, కొక్కిలిగడ్డ నాగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *