Breaking News

ఘనంగా పార్లమెంటరీ పార్టీ వర్క్‌షాప్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ వర్క్‌షాప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. ఈ వర్క్‌షాప్‌లో ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఇతర ముఖ్య నాయకులు, రాష్ట్ర పార్లమెంట్ కమిటీ సభ్యులు మరియు పలువురు పార్టీ ప్రతినిధులతో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రఘురామ్ పాల్గొని పార్లమెంట్ కమిటీ సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు, తెలుగుదేశం పార్టీ సజీవ వారసత్వం, మహానేత నందమూరి తారక రామారావు పరిపాలనా సిద్ధాంతాలు, ప్రజాకేంద్రిత రాజకీయాలపై ఆయన చేసిన మార్గదర్శక సంస్కరణలను వివరించారు.
అలాగే నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి పరిపాలన రాష్ట్ర అభివృద్ధికి ఎలా దోహదపడిందో, సాంకేతికత, పారదర్శకత, సంక్షేమం–అభివృద్ధి సమతౌల్యంపై ఆయన చేపట్టిన కార్యక్రమాలను విశదీకరించారు. యువ నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న నారా లోకేష్ కార్యకర్తలను ప్రోత్సహించే విధానం, భవిష్యత్ రాజకీయాల్లో ఆయన పోషించబోయే కీలక పాత్రపై కూడా సభ్యులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్ కమిటీ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను మరియు ప్రత్యేకంగా రూపొందించిన ట్రైనింగ్ రూములను సందర్శించారు. అనంతరం సభ్యులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు గ్రామ స్థాయి నుంచి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శాశ్వత అధికార సాధనకు ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
తరువాత ముఖ్య నాయకులతో కలిసి వార్ రూమ్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ కమిటీ సభ్యులకు రాజకీయ పరిణామాలు, పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై ఎలా శిక్షణ అందిస్తున్నారో సమీక్షించారు. ఇప్పటికే మండల కమిటీ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, అదే విధంగా బూత్ స్థాయి వరకు ఈ కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలని స్పష్టం చేశారు.

1985 లో తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతులు ప్రారంభమైన రోజులను స్మరించుకున్నారు. ఆ సమయంలో తనతో పాటు నెట్టెం రఘురామ్, బుచ్చయ్య చౌదరి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేవారని గుర్తుచేసుకుంటూ పార్టీ నిర్మాణ దశలో జరిగిన కృషిని వివరించారు. ఈ వర్క్‌షాప్ పార్టీ బలోపేతానికి, సిద్ధాంత పరమైన స్పష్టతకు, నాయకత్వ నైపుణ్యాల పెంపుకు దిశానిర్దేశం చేసే కీలక కార్యక్రమంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శిక్షణా కార్యక్రమాలను మరింత వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు ఇది బలమైన పునాది అయిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *