-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
-మద్యం కల్తీ చేసి అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న జగన్
-కల్తీతో తిరుపతి ప్రసాదం అపవిత్రం
-వైసీపీకి ఎప్పుడో ప్రజలు పాడె కట్టేసి శవయాత్ర జరిపించేశారు
-పాదయాత్ర కాదు పొర్లు దండాలు పెట్టిన జగన్ అధికారంలోకి రాలేడు : మంత్రి సవిత
-శ్రీసత్యసాయి జిల్లా వడిగేపల్లిలో పెన్షన్ల పంపిణీ
-రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ
గోరంట్ల/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ హయాంలో అన్ని కల్తీలే జరిగాయని, చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. ఆయన్ను ప్రజలెప్పుడూ నమ్మరని, వైసీపీకి ఎప్పుడో పాడి కట్టేసి శవయాత్ర నిర్వహించారని, ఉనికి కోసం జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధే సీఎం చంద్రబాబు విజన్ కు నిదర్శనమన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో వడిగేపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి గంధం చంద్రుడు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు మంత్రి సవిత పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. 119 ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మందికి రూ.2,717 కోట్ల మేర ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 2.63 లక్షల మందికి రూ.115 కోట్లు, పెనుకొండలో 40 వేల మందికి రూ.17 కోట్లు, గోరంట్ల మండలంలో 11 వేల మందికి రూ.4.29 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వడిగేపల్లి పంచాయతీలో 462 మందికి రూ.20 లక్షలు పింఛన్ల రూపంలో అందజేశామన్నారు. వడిగేపల్లి పంచాయతీలో ఇప్పటికే రూ.50 లక్షలతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, రూ.43 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టమన్నారు. రూ.21 లక్షలతో సిరి కల్చర్, గోకులం షెడ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. దీపం–2 పథకం కింద 1,240 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 529 మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.27 లక్షలు జమ చేశామన్నారు. తల్లికి వందనం పథకం కింద పంచాయతీలోని 268 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.47 లక్షలు జమ చేశామని తెలిపారు. త్వరలో రూ.31 లక్షలతో గ్రామ ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని వెల్లడించారు.
జగన్ వి చిల్లర రాజకీయాలు
అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ , రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో జగన్ అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నారని అన్నారు. కల్తీ గురించి జగన్ మాట్లాడడం విడ్డూరమని, ఏ విషయంలో ఆయన కల్తీ చేయలేదో చెప్పాలని నిలదీశారు. జగన్ హయామంతా కల్తీలేనని చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని విమర్శించారు. మద్యం కల్తీ చేసి అమామయకులు ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారన్నారు. ఉనికి కోసం, చిల్లర రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాదయాత్రకు వస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైసీపీకి ప్రజలు ఏనాడో పాడె కట్టేసి శవయాత్ర జరిపించేశారన్నారు. బడుగు బలహీన వర్గాల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. గత 19 నెలల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు స్పష్టంగా తెలుసని, సీఎం చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనందరావు, మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News